ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాకిస్థాన్ పోరాటం ముగిసింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ.. మెరుగైన రన్‌రేట్ లేని కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన తమ ఆఖరి సూపర్-8 పోరులో శ్రీలంకను 147 పరుగులకు కట్టడి చేయలేక రన్‌రేట్(-0.123)లో వెనుకబడి ఇంటిముఖం పట్టింది. పాకిస్థాన్ మాదిరే 3 మ్యాచ్‌ల్లో 3 పాయింట్లే సాధించినా.. మెరుగైన రన్‌రేట్‌తో న్యూజిలాండ్(1.390) సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది.
పాకిస్థాన్ నిష్క్రమణ ఖాయమైన క్షణం పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. డగౌట్‌లో దిగాలుగా కూర్చొని కనిపించాడు. ఉబికి వచ్చిన దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మైక్ హెస్సెన్‌తో పాటు పాక్ ఆటగాళ్లు, ఇతర సపోర్ట్ స్టాఫ్ కూడా తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

న్యూజిలాండ్‌కు చెందిన మైక్ హెస్సెన్ పరోక్షంగా తమ జట్టుకు సాయం చేశాడని పాకిస్థాన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. 'గెలిచిన జట్టుకు ఆనందం లేదు.. పోరాడిన జట్టుకు ఉపయోగం లేదు. కానీ మైదానంలో లేని టీమ్ గంతులు వేసింది.'అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు షాహిబ్జాదా ఫర్హాన్(60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100), ఫకార్ జమాన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84) విధ్వసంకర బ్యాటింగ్‌తో రాణించారు. ఈ ఇద్దరే తొలి వికెట్‌కు 176 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక(3/33) మూడు వికెట్లు తీయగా.. డసన్ షనక(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. దుష్మంత చమీర(1/48) ఒక వికెట్ తీసాడు.
అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. డసన్ షనకతో పాటు పవన్ రత్నాయకే(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. పాకిస్థాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్(3/23) మూడు వికెట్లు తీయగా.. షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.