
4 ఏళ్ల తర్వాత ఉప్పల్‌లో వన్డే
సుమారు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్.. అంతర్జాతీయ వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుంది. దాంతో ఈ మ్యాచ్ నిర్వహణను హెచ్‌సీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మ్యాచ్ కోసం హెచ్‌సీఏ చేస్తున్న ఏర్పాట్లు, టికెట్ల విక్రయాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గతేడాది ఆస్ట్రేలియాతో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన రసా భసను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అప్పటిలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్‌లైన్‌లో పేటీఎం వేదికగా మాత్రమే విక్రయిస్తామని అజారుద్దీన్ స్పష్టం చేశారు.

జనవరి 13 నుంచి టికెట్లు..
పేటీఎంలో టికెట్లు జనవరి 13 నుంచి 16 వరకు విడతల వారీగా అందుబాటులో ఉంటాయని అజారుద్దీన్ తెలిపారు. మ్యాచ్‌కు రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరని చెప్పిన హెచ్‌సీఏ అధ్యక్షుడు.. ఆన్‌లైన్‌లో విక్రయించిన టికెట్లను ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం వేదికగా జనవరి 15 నుంచి 18 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోవచ్చని తెలిపారు. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39,112 కాగా.. ఇందులో 9695 కాంప్లిమెంటరీ టికెట్స్ పోగా మిగతా 29, 417 టికెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే అమ్ముతామని అజారుద్దీన్ స్పష్టం చేశారు.

16న హైదరాబాద్‌కు టీమిండియా..
ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు జనవరి 14న హైదరాబాద్‌కు చేరుకుంటుందని, 15న ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటుందన్నారు. టీమిండియా మాత్రం జనవరి 16న నగరానికి వస్తుందని చెప్పారు. ఇరు జట్ల మధ్య జనవరి 21న (రాయ్‌పూర్ )రెండో వన్డే, 24న (ఇండోర్) మూడో వన్డే జరగనుంది. అనంతరం జనవరి 27న( రాంచీ) తొలి టీ20, 29న (లక్నో) రెండో టీ20, ఫిబ్రవరి 1న (అహ్మదాబాద్) మూడో టీ20 జరగనుంది. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. టీ20లు రాత్రి 7 గంటల నుంచి మొదలవ్వనున్నాయి.

తొక్కిసలాట..
గతేడాది సెప్టెంబర్‌లో ఉప్పల్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 టికెట్ల అమ్మకాల విషయంలో గందరగోళం చోటు చేసుకుంది. టికెట్ల విక్రయం విషయంలో హెచ్‌సీఏ దారుణంగా విఫలమైంది. సికింద్రాబాద్ జింఖానా మైదానం వేదికగా ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు మొదలుపెట్టగా... ఊహించని రీతిలో టికెట్ల కోసం అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు అభిమానులు తీవ్రంగా గాయపడటంతో హెచ్‌సీఏపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు తెలంగాణ ప్రభుత్వం జోక్యంచేసుకోవాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications












