వివాదాస్పదంగా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) లేఖపై హైదారబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) స్పందించింది. ఆ లేఖలో ఎస్‌ఆర్‌హెచ్ చేసిన ప్రతీ ఆరోపణకు వివరణ ఇచ్చింది. హెచ్‌సీఏ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడం ఏమాత్రం సబబు కాదని పేర్కొంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉద్యోగుల్లోని కొందరు వ్యక్తుల వల్లే ఈ గొడవ తలెత్తిందని హెచ్‌సీఏ స్పష్టం చేసింది.
ఐపీఎల్ 2025 ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ తమను వేధిస్తోందని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజర్ శ్రీనాథ్.. హెచ్‌సీఏ సెక్రటరీ సీజే శ్రీనివాస్‌కు చేసిన మెయిల్ వెలుగులోకి వచ్చింది. గత రెండేళ్లుగా హెచ్‌సీఏ తమను ఇబ్బంది పెడుతుందని, ఇలానే చేస్తే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన హెచ్‌సీఏ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

వారి వల్లే ఈ గొడవ..
ఈ క్రమంలోనే హెచ్‌సీఏ తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ.. సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. సన్‌రైజర్స్ ఉద్యోగుల్లోని కొందరు వ్యవహరించిన అమర్యాదపూర్వకమైన తీరు వల్లే ఈ సమస్యలు వచ్చాయని తెలిపింది. 'హెచ్‌సీఏ కోటాకు మించి అదనపు పాసులు ఎప్పుడూ అడగలేదు. హెచ్‌సీఏ పరువుకు భంగం కలిగించడం సరికాదు. ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకుపోయాం. హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యుల పట్ల సన్‌రైజర్స్ ఉద్యోగుల్లోని కొందరు వ్యవహరించిన అమర్యాదక తీరు వల్లే ఈ సమస్యలు వచ్చాయి.
చర్చలతో పరిష్కారం..
ఇప్పటికైనా ఈ-మొయిల్స్‌కి స్వస్తి చెప్పి, ఎస్ఆర్‌హెచ్ మెనేజ్‌మెంట్ హెచ్‌సీఏతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించకోవచ్చు. అందుకు హెచ్‌సీఏ కార్యవర్గం సిద్ధంగా ఉంది. గత రెండు మ్యాచ్‌లకు హెచ్‌సీఏకు 3,880 కాంప్లిమెంటరీ పాసులు మాత్రమే ఇచ్చారు. ఎఫ్-12 ఏ బాక్సులో సామర్థ్యానికి మించి 50 టికెట్లు ఇస్తామంటే.. ఆ బాక్సులో 30 ఇచ్చి మిగిలిన 20 పాసులను మరో బాక్సులో సర్దుబాటు చేయాలని కోరాం. ఈనెల 27వ తేదీన జరిగిన భేటీలో ఎస్ఆర్‌హెచ్ ప్రతినిధులు కిరణ్, శరవాణన్, రోహిత్ సురేష్ అందుకు అంగీకరించారు. హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్‌తో జరిగిన ఈ భేటీలో పాల్గొనని శ్రీనాథ్ ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు.
ఒప్పుకొని ఆరోపణలా..?
ఎఫ్-12 ఏ బాక్సులో సామర్థ్యానికి మించి ఇస్తున్న టిక్కెట్లను వేరే దగ్గర ఇచ్చేందుకు అంగీకరించి.. ఇప్పుడు బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలు చేయడం సరికాదు. హెచ్‌సీఏ క్లబ్ సెక్రటరీల కోసం మాత్రమే అదనంగా 10 శాతం టికెట్లను ప్రతీ మ్యాచ్‌కు బ్లాక్ చేయమని చెప్పాం. అవి అధ్యక్షుడి కోసం కాదు. అందుకు డబ్బులు కూడా చెల్లిస్తామని చెప్పగా.. సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ అంగీకరించింది. ఇప్పటివరకు జరిగిన విషయాలను పక్కనబెట్టి విశాల దృక్పథంతో సమస్యల పరిష్కారానికి హెచ్‌సీఏతో చర్చలకు రావాలని కోరుతున్నాం.'అని హెచ్‌సీఏ తమ ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశాలకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు దూరంగా ఉంటారని కూడా స్పష్టం చేసింది.