హైదరాబాద్: హెచ్‌సీఏ(హైదరాబాద్ క్రికెట్) అసోసియేషన్‌లో భారీ మోసం వెలుగు చూసింది. పరస్పర విరుద్ద ప్రయోజనలున్న 57 క్రికెట్ క్లబ్‌లపై నిషేధం పడిన మరునాడే హెచ్‌సీఏ పెద్దల అవీనితి బయటపడింది. జట్టులో చోటు కల్పించేందుకు ఆటగాళ్ల నుంచి రూ. లక్ష వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
హెచ్‌సీఏ ఆధ్యర్యంలో నడిచే ఓ క్లబ్ ఓనర్.. తమ జట్టు తరఫున ఆడేందుకు ప్లేయర్ల నుంచి లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జట్టులో ఫస్ట్ డౌన్ ప్లేయర్ ఆడిస్తానని చెప్పి తన వద్ద లక్ష వసూలు చేసారని ఓ ప్లేయర్ చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయంశమైంది. అయితే ఈ వ్యవహారం పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు.

పోలీసుల వివరణ కోరగా.. ఈ ఘటనలో చాలా మంది బాధితులు ఉన్నారని, స్పెషల్ టీమ్స్‌తో విచారణ జరిపించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని బదులిచ్చారు.
మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరిగిన అండర్ 19 సెలెక్షన్స్ ట్రయల్స్‌లోనూ గందరగోళం చోటు చేసుకుంది. సరైన ప్రణాళిక లేకుండా ఈ ట్రయల్స్ నిర్వహించడంతో క్రీడాకారులు ఇబ్బంది పడ్డారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్లేయర్లు ట్రయల్స్‌కు రావడంతో హెచ్‌సీఏ అధికారులు చేతులెత్తేసారు.
అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్లేయర్లను హెచ్‌సీఏ వెనక్కు పంపించింది. ఇబ్బందులతో ఆగ్రహానికి గురైన క్రీడాకులు హెచ్‌సీఏ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సుప్రీం నియమించిన రిటైర్డ్ జస్టిన్ నాగేశ్వర్ రావు సమక్షంలో ఈ సెలెక్షన్స్ ట్రయల్స్ జరిగినా.. సరైన ఏర్పాట్లు చేయలేకపోయారు. దాంతో ప్లేయర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిండి, నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడ్డారు.
ఆఫీస్ బేరర్ల ఎన్నిక, గుర్తింపు, యాజమాన్య బదిలీ, మల్టీపుల్ ఓనర్‌షిప్, పరస్పర విరుద్ధ ప్రయోజనాలు తదితర ఫిర్యాదులపై సదరు క్లబ్‌ల ప్రతినిధుల నుంచి వివరణ కోరిన రిటైర్డ్ జస్టిస్ నాగేశ్వర్ రావు.. అనంతరం చర్యలు తీసుకుంటూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాల ప్రకారం 57 క్లబ్‌లకు చెందిన ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ హెచ్‌సీఏలో ఎలాంటి పదవీ బాధ్యతలు నిర్వర్తించడానికి వీలు లేదు. ఈ నిషేధం ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ టర్మ్ ముగిసేవరకు లేదంటే మూడేళ్ల పాటు కొనసాగుతోంది. ఎన్నికల్లో ఆయా క్లబ్‌లకు ఓటు హక్కు కూడా ఉండబోదు. అయితే ఈ క్లబ్‌లకు చెందిన జట్లు హెచ్‌సీఏ లీగ్‌లు, టోర్నీల్లో ఆడేందుకు అనుమతించారు.