నగరంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) సిద్దమవుతోంది. హైదరాబాద్ శివార్లలో 100 ఎకరాల్లో.. లక్ష సీటింగ్ కెపాసిటీతో పాటు అధునాతన సౌకర్యాలతో కొత్త స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు మీడియాకు తెలిపారు.
అంతర్జాతీయ స్టేడియంతో పాటు 8 ఉమ్మడి జిల్లాల్లో మినీ స్టేడియాలను నిర్మిస్తామని చెప్పారు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. కొత్త స్టేడియంతో పాటు జిల్లాల్లోని మినీ స్టేడియాల నిర్మాణానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అనుమతిచ్చిందని చెప్పారు.
భూములు సేకరించిన వెంటనే కొత్త స్టేడియాల నిర్మాణానికి బీసీసీఐ నిధులు ఇవ్వనుందన్నారు. ప్రభుత్వం నుంచి భూములు లీజ్ తీసుకోకుండా హెచ్‌సీఏ తరఫున కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

భూములు కొనుగోలు చేస్తాం..
'హైదరాబాద్‌తో పాటు జిల్లాల నుంచి ప్రతిభ కలిగిన క్రికెటర్లు వెలుగులోకి రావాలనేదే మా లక్ష్యం. అందుకోసం జిల్లాల్లో మినీ స్టేడియాలను నిర్మించాలనుకుంటున్నాం. ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించాం. భూములను లీజు తీసుకోకుండా హెచ్‌సీఎ తరఫున డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తాం.
మార్కెట్ ప్రైజ్ అయినా.. ప్రభుత్వ ధర.. అయినా లేదా.. ప్రభుత్వం ఇచ్చే డిస్కౌంట్ ధర అయినా చెల్లించి భూములు కోనుగోలు చేస్తాం. ప్రైవేట్ వ్యక్తుల నుంచి కాకుండా ప్రభుత్వం నుంచి భూములు కొనుగోలు చేస్తే న్యాయపరమైన చిక్కులు రావు. ఇప్పటికే ఈ విషయంపై క్రీడా మంత్రిత్వశాఖతో పాట అధికారులు, జిల్లా కలెక్టర్లను అప్రోచ్ అయ్యాం.
100 ఎకరాల్లో స్టేడియం..
ప్రభుత్వం నుంచి మాకు సానుకూల స్పందన వచ్చింది. సీఏం రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే మాకు అపాయింట్‌మెంట్ ఇస్తానని చెప్పారు. పూర్తి ప్రపోజల్స్‌తో రావాలని సూచించారు. ఇప్పటికే ప్రపోజల్స్ అన్నీ సిద్దం చేశాం. జిల్లాలతో పాటు హైదరాబాద్ నగర శివార్లలోనూ 100 ఎకరాల్లో అధునాతన సౌకర్యాలతో పాటు లక్ష సీటింగ్ కెపాసిటీతో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలనుకుంటున్నాం.
ఉప్పల్ స్టేడియం సరిపోవడం లేదు..
ప్రస్తుత ఉప్పల్ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 38 వేలు. సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్ సందర్భంగా సమస్యలు వస్తున్నాయి. 38 వేల సీట్లు ఉంటే 2 లక్షల మంది మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే లక్ష సీటింగ్ కెపాసిటీతో మైదానాన్ని నిర్మించాలనుకుంటున్నాం.
100 ఎకరాల్లో ఈ స్టేడియం ఉండాలనుకుంటున్నాం. ముఖ్యంగా రంజీ ట్రోఫీ సందర్భంగా మాకు స్డేడియాల కొరత ఏర్పడుతోంది. కొన్ని గ్రౌండ్స్‌ను లీజుకు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రంజీ మ్యాచ్‌ల కోసం ఒక నాలుగు, ఐదు మైదానాలను సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే చోట క్రికెట్ క్యాంపస్ ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు.
ఇందులో ఓ పెద్ద అంతర్జాతీయ స్టేడియంతో పాటు పది చిన్న మైదానాలు ఏర్పాటు చేసుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతాయి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణంతో పాటు జిల్లాల్లో స్టేడియాలు ఏర్పాటు చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అనుమతిచ్చింది. స్థలం కొనుగోలు చేసిన వెంటనే ఫండ్స్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్దంగా ఉంది.'అని జగన్‌మోహన్ రావు తెలిపారు.