టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్ విప్లవాన్ని తీసుకొచ్చిన సారథి విరాట్ కోహ్లీ మాత్రమేనని కొనియాడు. ఈ తరం క్రికెట్‌లో అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ కారణంగానే భారత క్రికెట్‌లో కుర్రాళ్లంతా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారని తెలిపాడు. విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాడు.
యో యో టెస్ట్‌తో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను తరుచూ పరీక్షించేవారు. ఎంత పెద్ద ఆటగాడైనా సరే యో యో టెస్ట్ పాసవ్వకపోతే జట్టులో చోటు దక్కేది కాదు. దాంతో కోహ్లీ సారథ్యంలో భారత అసాధారణ విజయాలను అందుకుంది. ఫిట్‌నెస్ సూత్రాన్ని ముందుగా తాను పాటించిన కోహ్లీ.. కఠిన వ్యాయామాలతో పాటు డైట్‌తో ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారాడు. సహచర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. ఫిట్‌గా ఉండటంతోనే కోహ్లీ గాయాల బారిన పడకుండా తన కెరీర్‌ను కొనసాగించాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో గాయాలతో కోహ్లీ ఇబ్బంది పడి మ్యాచ్‌కు దూరమవ్వడం చాలా తక్కువ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సెహ్వాగ్ కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ప్రపంచ క్రికెట్‌లోనే ఫిట్‌నెస్ ట్రెండ్‌ను కోహ్లీ ప్రారంభించాడు. భారత క్రికెట్‌లోకి కూడా ఫిట్‌నెస్ సంప్రదాయాన్ని తీసుకొచ్చాడు. ఈ తరంలో అతనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్. ఈ రోజుల్లో ప్రతీ యంగ్ క్రికెటర్ ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాడంటే దానికి కారణం విరాట్ కోహ్లీ'అని సెహ్వాగ్ కొనియాడాడు.
యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ 2025లో భారత్ విజేతగా నిలుస్తుందని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. 'ఆసియా కప్ టోర్నీకి యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. సూర్య భయం లేని కెప్టెన్. అతని సారథ్యంలో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుంది. సూర్య ఆలోచన విధానం టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతుంది. జట్టు మొత్తం అదే వైఖరి కనబరిస్తే టీమిండియా మరోసారి ఆసియా కప్ ఛాంపియన్స్‌గా నిలుస్తుంది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ టీ20 టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడుతున్నాయి. సెప్టెంబర్ 9న యూఏఈతో, 14న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా, శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కలేదు.