టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన మాజీ సతీమణి హసీన్ జహాన్‌కు నెలకు రూ. 4 లక్షలు భరణం చెల్లించాలని కోల్‌కతా హై కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును స్వాగతించిన హసీన్ జహాన్.. తనకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేసింది. మహమ్మద్ షమీ కారణంగా తన మోడలింగ్ కెరీర్ నాశనమైందని, దాంతో భరణం చెల్లించాలని కోర్టును ఆశ్రయించినట్లు మీడియాకు తెలిపింది.
మోడల్ అయిన హసీన్ జహాన్‌ను 2014లో మహమ్మద్ షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరుసటి ఏడాది వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. కానీ షమీ వైవాహిక జీవితం నాలుగేళ్లకే ముగిసింది. 2018లో షమీపై హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. గృహ హింస కేసు పెట్టడంతో పాటు షమీ స్త్రీలోలుడని, చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ పేట్టుకున్నాడని పేర్కొంది. ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడని, ఏజ్ ఫ్రాడ్ చేశాడని కూడా ఆరోపించింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ కోర్టు సమక్షంలో విడాకులు తీసుకొని వేర్వేరుగా జీవిస్తున్నారు.
విడాకుల అనంతరం తనకు భరణంగా ప్రతీ నెలా రూ. 7 లక్షలు ఇవ్వాలని హసిన్ జహాన్ డిమాండ్ చేసింది. ఇందుకు షమీ అంగీకరించకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. హసిన్ జహాన్ మోడలింగ్ చేస్తుందని, భరణం అవసరం లేదని ముందుగా కోర్టు తోసిపుచ్చింది. అయినా వెనుకడుగు వేయని హసిన్ జహాన్ తన పోరాటాన్ని కొనసాగించింది. ముందుగా అలీపూర్ కోర్టు షమీని తన భార్య, బిడ్డ కోసం నెలకు రూ.80,000 భరణంగా చెల్లించాలని ఆదేశించింది. ఆ తర్వాత జిల్లా జడ్జి ఈ ఆదేశాన్నిసవరించారు. జిల్లా జడ్జి మహ్మద్ షమీని తన భార్య కోసం నెలకు రూ.50,000, బిడ్డ కోసం నెలకు రూ.80,000 చెల్లించాలని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ హసీన్ జహాన్.. కోల్‌కతా హై కోర్టును ఆశ్రయించింది.

తన నెలవారీ ఖర్చు సుమారు రూ.6.5 లక్షలు అని, షమీ వార్షిక ఆదాయం సుమారు రూ.7.5 కోట్లుగా ఉందని హసీన్ జహాన్ తన పిటీషన్‌లో పేర్కొంది. భారీగా సంపాదిస్తున్నప్పటికీ షమీ తన మాజీ భార్య, బిడ్డకు అవసరమైన డబ్బును ఇవ్వడం లేదని తన వాదనలను వినిపించింది. సుదీర్ఘ విచారణ అనంతరం కోల్‌కతా హై కోర్టు హసీన్ జహాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నెలకు రూ. 4లక్షల భరణం చెల్లించాలని షమీని ఆదేశించింది. ఇందులో రూ.1.5 లక్షలు హసీన్ జహాన్ ఖర్చుల కోసం.. మరో రూ.2.5 లక్షలు వారి కుమార్తె ఐరా మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలని ఆదేశించింది. షమీ వార్షిక ఆదాయం దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ తీర్పుపై స్పందించిన హసీన్ జహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'షమీతో పెళ్లికి ముందు నేను మోడల్‌గా నటించాను. పెళ్లి తర్వాత షమీ బలవంతంగా నన్ను మోడలింగ్‌కు దూరం చేశాడు. తన జీవితంలో నేను హౌస్ వైఫ్‌గా మాత్రమే ఉండాలని కోరుకున్నాడు. నేను షమీని ఎంతో ప్రేమించాను. దాంతో అతని కోరికను కాదనలేకపోయాను. దాంతో నా కెరీర్ నాశనమైంది. ఇప్పుడు నాకు సంపాదన లేకుండా పోయింది. నా అవసరాలను, ఖర్చులను షమీనే భరించాలి. దానికి అతను అంగీకరించకపోవడంతో నేను కోర్టును ఆశ్రయించాను. ఈ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉంది. ఆ దేవుడికి ధన్యవాదాలు. ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకునే ముందు వారు ఎలాంటి వారో మనకు తెలియదు. వారి గురించి వారి నుదుటిపై రాసి ఉండదు. నేను కూడా అందరిలానే బాధితురాలిని అయ్యాను.'అని హసిన్ జహాన్ చెప్పుకొచ్చింది.