కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగే విషయాన్ని తనకు ఆలస్యంగా చెప్పారని టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా అన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైన 2 ఓవర్ల తర్వాత కంకషన్ సబిస్టిట్యూట్‌గా శివమ్ దూబే స్థానంలో బరిలోకి దిగాలని చెప్పారని తెలిపాడు. ఇప్పటికీ ఈ అరంగేట్రాన్ని నమ్మలేకపోతున్నానని, కలగానే అనిపిస్తోందన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో పుణె వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ సందర్భంగా చివరి ఓవర్‌లో జేమీ ఓవర్టన్ వేసిన బౌన్సర్ శివమ్ దూబే తలకు బలంగా తాకింది. దాంతో నిబంధనల ప్రకారం అతని స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణా బరిలోకి దిగాడు. ఈ అవకాశాన్ని హర్షిత్ రాణా అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన మూడు వికెట్లు పడగొట్టాడు. అనూహ్య పరిస్థితుల మధ్య ఓ ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా.. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

ఈ సందర్భంగా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడాలనే విషయం ఎప్పుడు తెలిసిందని ప్రశ్నించగా.. ఆలస్యంగా చెప్పారని రాణా బదులిచ్చాడు. 'ఇప్పటికీ నా అరేంగ్రటాన్ని నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది. దూబే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన రెండు ఓవర్ల తర్వాత కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాలని చెప్పారు. ఈ ఒక్క సిరీస్‌లోనే కాదు.. అవకాశం కోసం నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌లో నా సత్తా ఏంటో తెలియజేయాలనుకుంటున్నాను. ఐపీఎల్‌లో నేను మెరుగ్గా బౌలింగ్ చేశాను. అదే తరహాలోనూ ఇక్కడ రాణించాను.'అని హర్షిత్ రాణా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. రింకూ సింగ్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30), అభిషేక్ శర్మ(19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29)పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్(3/35) మూడు వికెట్లు తీయగా.. జేమీ ఓవర్టన్(2/32) రెండు వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. హ్యారీ బ్రూక్(26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. బెన్ డకెట్(19 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 39), ఫిల్ సాల్ట్(21 బంతుల్లో 4 ఫోర్లతో 23) శుభారంభం అందించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(3/33), రవి బిష్ణోయ్(3/28) మూడేసి వికెట్లు తీయగా. వరుణ్ చక్రవర్తీ(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్(1/35), అక్షర్ పటేల్(1/26) చెరో వికెట్ తీసుకున్నారు.