
రాజ్‌కోట్: యువ పేసర్, కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌లా మెరుపు వేగంతో తాను బౌలింగ్ చేయలేనని టీమిండియా స్టార్ పేసర్ హర్షల్ పటేల్ తెలిపాడు. అయితే వేగంగా బౌలింగ్ చేయకపోయినా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తానని చెప్పాడు. మెరుపు వేగంతో బంతులు వేసే సామర్థ్యం లేనప్పుడు బౌలింగ్‌లో వైవిధ్యాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా కీలక బౌలర్‌గా మారిన హర్షల్ పటేల్.. వైజాగ్ టీ20లో 4 వికెట్లతో సత్తా చాటాడు. 3.1 ఓవర్లు వేసి 25 పరుగులే ఇచ్చాడు. దాంతో ఆ మ్యాచ్‌లో భారత్ 48 పరుగులతో గెలుపొందింది.
గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన హర్షల్.. 11 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. రాజ్‌కోట్ వేదికగా నేడు జరగనున్న నాలుగో టీ20 కోసం హర్షల్ పటేల్ సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే తన బౌలింగ్ ప్రణాళికల గురించి మాట్లాడాడు. 'గత రెండేళ్లుగా అభిమానులు నేనెలా ప్రదర్శన చేస్తానో అని ఆసక్తిగా చూస్తున్నారు. ఏ బౌలర్ అయినా ఎక్కువ కాలం ఆడితే అతడి బలమేంటో ప్రత్యర్థులకు తెలిసిపోతుంది. అయితే ఒక బౌలర్‌గా నేను వాళ్లకంటే ఒక అడుగు ముందు ఉండాలని కోరుకుంటా. మనకు ఎన్నో ప్రణాళికలు ఉంటాయి.
అయితే ఒత్తిడి సమయంలో అవసరం అయినప్పుడు ఆ ప్రణాళికలను ఆత్మవిశ్వాసంతో అమల్లో పెట్టగలగాలి. కీలక సమయంలో సరైన బంతి వేయడంపైనే నా దృష్టి ఉంటుంది. బంతుల్లో వేగం గురించి ఆలోచించట్లేదు. ఉమ్రాన్ మాలిక్‌లా మెరుపు వేగంతో బౌలింగ్ చేయలేను. అందుకే అంతర్జాతీయ కెరీర్ ఎక్కువ కాలం ఉండేందుకు బంతుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాను. 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలను. అయితే నా దృష్టి ఎప్పుడూ వైవిధ్యంపైనే ఉంటుంది. ముఖ్యంగా స్లో పిచ్‌లపై బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడతాను. అయితే దిల్లీ లాంటి పిచ్‌లపై ఆడితే బౌలర్ల ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది'అని హర్షల్ పటేల్ చెప్పుకొచ్చాడు.