ఐపీఎల్ 2018 వేలంలో నేను దారుణంగా మోసపోయాను: హర్షల్ పటేల్

ముంబై: ఐపీఎల్ 2018 సీజన్ మెగా వేలంలో తనను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్ హర్షల్ పటేల్ అన్నాడు. అయితే వేలానికి ముందు రెండు, మూడు ఫ్రాంచైజీలు తనను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఆ జట్లలోని ఆటగాళ్లు తెలిపారని, కానీ వేలంలో ఏ ఒక్కరు కూడా తనపై బిడ్ వేయలేదన్నాడు. ఆ క్షణం ఫ్రాంచైజీలు తనకు ద్రోహం చేశాయని, తాను మోసపోయానని భావించానన్నాడు. ఆ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ హర్షల్ పటేల్‌ను రూ.20 లక్షల కనీస ధరకు తీసుకుంది. 2021 సీజన్‌లో ట్రేడింగ్ ద్వారా హర్షల్ పటేల్ ఆర్‌సీబీ జట్టులోకి రాగా.. అతను అద్భుత ప్రదర్శనతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.

దారుణ మోసం..
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ అతన్ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. తనపై పెట్టిన ధరకు హర్షల్ పటేల్ న్యాయం చేస్తూ చెలరేగుతున్నాడు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ 'బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్' యూట్యూబ్ షోలో పాల్గొన్న హర్షల్ పటేల్.. తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '2018 ఐపీఎల్ వేలంలో నా కోసం ఎవరైనా బిడ్ వేస్తారనకున్నా. డబ్బుల గురించి ఆలోచించలేదు. కానీ ఐపీఎల్ ఆడాలనుకున్నా. భిన్న ఫ్రాంచైజీలకు చెందిన నలుగురు ఆటగాళ్లు నా కోసం తమ ఫ్రాంచైజీలు బిడ్ వేస్తాయని చెప్పారు. కానీ ఎవరూ బిడ్ వేయలేదు.
ఆ క్షణం నేను దారుణంగా మోసపోయాని, ఫ్రాంచైజీలు ద్రోహం చేశాయని భావించా. ఈ చీకటి ఆలోచనల నుంచి బయటపడాలనుకున్నా. నా ఆటను మెరుగుపరుచుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా.

గేమ్‌ను అర్థం చేసుకో..
ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా నెట్‌బౌలర్‌గా సేవలందించిన నేను.. మహేంద్ర సింగ్ ధోనీతో నా బౌలింగ్ గురించి మాట్లాడాను. నా బౌలింగ్‌లో బలహీనతలు ఏమైనా ఉన్నాయా? మెరుగుపరుచుకోవాల్సింది ఉందా? అని అడిగాను. అయితే అలాంటిదేం లేదని చెప్పిన మహీ భాయ్.. నీకు నీ ఫార్మూలా ఉంది. నువ్వు చేయాల్సిందల్లా గేమ్‌ను బాగా అర్థం చేసుకోవడం. ఆడుతున్నంత కాలం ఈ పనిచేయాల్సిందే. అలాగే ఫిట్‌గా ఉండమని ధోనీ సూచించాడు.

మ్యాచ్‌కు ముందు టాయిలెట్..
మ్యాచ్ ప్రారంభానికి ముందు నేను బాగా ఆందోళనకు గురయ్యేవాడిని. తొలి బంతి వేసే వరకు తీవ్రంగా టెన్షన్ పడేవాడిని. దాంతో ప్రతీ 2 నిమిషాలకు టాయిలెట్‌కు వెళ్లేవాడిని. ఆ ఆందోళన కారణంగా మ్యాచ్ ఎప్పుడు అయిపోతుందా? ఎప్పుడూ ప్రశాంతంగా నిద్రపోతామా? అని ఆలోచించేవాడిని. ఇప్పటికీ ఆ సమస్య ఉంది. కానీ ఇదంతా ఆటలో సహజమేనని తెలుసుకున్నా. గత సీజన్‌లో ఏబీ డివిలియర్స్‌తో మాట్లాడినప్పుడు అతను కూడా మ్యాచ్ ముందు ఆందోళనతో టాయిలెట్‌కు వెళ్తానని చెప్పాడు. దాంతో ఏబీడి వంటి దిగ్గజానికి అలా జరుగుతున్నప్పుడు నేనంతా? అని అనుకున్నా. నువ్వొక్కడివే ఈ సమస్య ఎదుర్కొవడం లేదని లైట్ తీసుకున్నా.

జీవితంలో తొలిసారి..
2016 ఐపీఎల్ సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన నాకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. 2017లో కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఒకరోజు ఆర్‌సీబీ కోచ్‌గా ఉన్న డానియల్ వెటోరీ.. 'నువ్వు జట్టులో ఆడే అవకాశాలు లేవు. నిన్ను ఇంటికి పంపించాలనుకుంటున్నాం. అవసరమైతే మళ్లీ పిలుపిస్తాం'అని చెప్పాడు. దాంతో నేను నా వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నా. నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని వెటోరికి సందేశం పంపాను. జీవితంలో తొలి సారి అవకాశం కోసం నోరు తెరిచి అడిగాను'అని హర్షల్ పటేల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications