హర్షా భోగ్లే వారి ఐపీఎల్ 2020 బెస్ట్ ఎలెవన్.. రబడా, కోహ్లీ, రోహిత్‌లకు నోచాన్స్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్ ముగియడంతో మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అద్భుత ప్రదర్శన కనబర్చిన 11 మంది ఆటగాళ్లతో అత్యుత్తమ జట్లను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు తమ అత్యుత్తమ జట్లు ప్రకటించగా.. తాజాగా స్పోర్ట్స్ జర్నలిస్ట్, ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే తన ఐపీఎల్ 2020 బెస్ట్ టీమ్‌ను ప్రకటించాడు. క్రిక్‌బజ్ లైవ్‌లో తన టీమ్ వివరాలను వెల్లడించాడు. అయితే తన జట్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు అవకాశం దక్కలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సీజన్ పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన కగిసో రబడాను కూడా భోగ్లే విస్మరించాడు.

ఓపెనర్లుగా రాహుల్, ధావన్
ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా తీసుకున్న హర్షా.. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో చెలరేగిన శిఖర్ ధావన్‌ను మరో ఓపెనర్‌గా ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ఓ సెంచరీతో 670 పరుగులు చేయగా.. గబ్బర్ 17 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలతో 618 రన్స్ చేశాడు. కాకపోతే ఈ ఇద్దరు తమ జట్లను చాంపియన్‌గా నిలబెట్టలేకపోయారు. లక్ లేక ఫస్టాఫ్‌లో ఓడిన రాహుల్ సేన.. సెకండాఫ్‌లో విజృంభించింది. కానీ కీలక మ్యాచ్‌లో ఓడి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఇక ఢిల్లీ ఫైనల్లో పటిష్ట ముంబై చేతిలో చిత్తయిన విషయం తెలిసిందే.

ఇండియన్ ‘ఏబీడీ'
ఇక మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్య కుమార్ యాదవ్‌ను ఎంచుకున్న హర్షా భోగ్లే.. నాలుగో స్థానంలో ఆర్‌సీబీ హిట్టర్ ఏబీ డివిలియర్స్‌ను తీసుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో నిలకడైన బ్యాటింగ్‌తో సూర్య ఇండియన్ ఏబీడీగా ప్రశంసలు అందుకోగా.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా తన ఆటలో ఏ మాత్రం మార్పు లేదన్నట్లు ఒంటి చేత్తో యూనివర్సల్ ఏబీడీ విజయాలందించాడు. దాంతో హర్షా మూడులో ఇండియన్ ఏబీడీ, నాలుగులో యూనివర్సల్ ఏబీడీని ఎంచుకున్నాడు. ఇక ఐదులో కీరన్ పొలార్డ్‌ను తీసుకున్న భోగ్లే.. ఆరులో హార్దిక్ పాండ్యాను ఎంచుకున్నాడు. ఈ ఇద్దరు ముంబై ఇండియన్స్ తరఫున పరుగుల విధ్వంసం సృష్టించారు. ఆఖర్లో వచ్చి ముంబై బౌలర్లను ఆడుకున్నారు.

రబడాకు బదులు ఆర్చర్..
ఇక రాజస్థాన్ రాయల్స్ తరఫున సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చిన జోఫ్రా ఆర్చర్‌ను తీసుకున్న భోగ్లే.. లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రబడాను పక్కనపెట్టేశాడు. అలాగే భారత పేస్ ద్వయం జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను తీసుకున్నాడు. బుమ్రా ముంబై తరఫున చెలరేగగా.. షమీ పంజాబ్ తరఫున అదరగొట్టాడు. ఇక స్పిన్నర్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సెన్సేషన్ రషీద్ ఖాన్, ఆర్‌సీబీ మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌లను ఎంచుకున్నాడు. ఈ ఇద్దరు ఈ సీజన్‌లో బంతిని అద్భుతంగా తిప్పేసారు.

హర్షా బెస్ట్ ఎలెవన్..
కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, సూర్య కుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్ (కీపర్), కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, జోఫ్రా ఆర్చర్, రషీద్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications