
మెల్‌బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో అందరి కంటే ముందుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవడంపై భారత మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేసింది. న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 4 పరుగులతో గెలిచి హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. తాము సాధారణ స్కోర్లే చేస్తున్నా దాన్ని కాపాడుకుని విజయాలు సాధించడం థ్రిల్లింగ్‌గా ఉంటే.. సెమీస్‌కు చేరడం గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పుకొచ్చింది.
'మేం పదే పదే అవే తప్పులు పునరావృతం చేసినా.. అద్భుత ప్రదర్శనతో గెలుపొందడం గొప్ప అనుభూతినిచ్చింది. ప్రతీ మ్యాచ్‌లో 10 ఓవర్ల పాటు మా స్కోర్ బాగానే ఉంటున్నా.. ఆ మూమెంట్‌ను కడవరకు కొనసాగించలేక పోతున్నాం. నాతో పాటు పలవురు విఫలమవ్వడంతో భారీ స్కోర్లు చేయలేకపోతున్నాం. రాబోవు మ్యాచ్‌ల్లో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాం.'అని హర్మన్ చెప్పుకొచ్చింది.
ఇక న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ మాట్లాడుతూ.. ఈ ఉత్కంఠకర మ్యాచ్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని తెలిపింది. గెలుపు కోసం కడవరకు పోరాడిన తమ ఆట తీరు నచ్చిందని, దీంతో ఓడామనే భావన లేదని పేర్కొంది. 'మేము చాలా బాగా ఆడాం. భారత్‌ను 133 పరుగులకే కట్టడి చేయడం నిజంగా గొప్ప విషయం.
షెఫాలీ వర్మ ధాటిగా బ్యాటింగ్ చేసినా మిగతా వారిని కట్టడి చేసి సాధారణ స్కోరుకే పరిమితం చేశాం. కానీ ఇంకా ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడలేదు. బంతి నుంచి మరింత పేస్, బౌన్స్ వస్తుందని అనుకుంటే అలా జరగలేదు. మేం కడవరకూ వచ్చి ఓడిపోవడంతో పెద్దగా బాధనిపించలేదు. ఈ మ్యాచ్ ద్వారా మేము అనేక పాఠాలు నేర్చుకున్నాం' అని షెఫాలీ తెలిపారు.