ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనను భారత మహిళ జట్టు 'టై'తో ముగించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్ ఫలితం తేలకుండా టై అయ్యింది. దాంతో సిరీస్ 1-1తో సమమైంది. అయితే ఈ మ్యాచ్ అంపైర్లపై టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తన ఔట్ విషయంలో అంపైర్లు తప్పు చేశారని ఆరోపించిన ఆమె.. సహనం కోల్పోయి వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. అంతటితో ఆగకుండా బండబూతులు తిడుతూ మైదానం వీడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ వేసిన మూడో బంతిని లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది. కానీ బంతి బ్యాట్‌ను మిస్సై ఆమె ప్యాడ్లను తాకింది. దాంతో బంగ్లా ఆటగాళ్లు ఎల్బీ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ సిరీస్‌లో డీఆర్‌ఎస్ అందుబాటులో లేకపోవడంతో అంపైర్‌దే తుది నిర్ణయంగా మారింది. దాంతో కోపంతో ఊగిపోయిన హర్మన్.. బ్యాట్‌కు బంతి తాకిందని, సరిగ్గా అంపైరింగ్ చేయలేవా? అంటూ గట్టిగా అరుస్తూ క్రీజును వీడింది.
ఇక మ్యాచ్ అనంతరం కూడా అంపైర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సిరీస్‌లో అంపైర్లు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించింది. మరోసారి ఇక్కడికి వచ్చేటప్పుడు అంపైర్లకు అనుగుణంగా సిద్దమై వస్తామని వ్యంగ్యస్త్రాలు సంధించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్ ఫర్‌గానా హోక్(160 బంతుల్లో 7 ఫోర్లు 107) సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ షమీమా సుల్తానా(78 బంతుల్లో 5 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. దేవికా విద్య ఓ వికెట్ పడగొట్టింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధానా(85 బంతుల్లో 5 ఫోర్లతో 59), హర్లీన్ డియోల్(108 బంతుల్లో 9 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్(45 బంతుల్లో 33 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో టెయిలెండర్లు సహకరించకపోవడంతో భారత్ విజయాన్ని అందుకోలేకపోయింది.
ఓ దశలో 52 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో సునాయసంగా గెలిచేలా కనిపించిన భారత మహిళా జట్టు.. చివర్లో వరుస వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ పూర్తి అయ్యే సమయానికి షెడ్యూల్ టైం కూడా అయిపోవడంతో సూపర్ ఓవర్ పెట్టేందుకు రిఫరీ అంగీకరించలేదు.