మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా గురువారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. టాపార్డర్ వైఫల్యంతోనే ఈ మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. తమ కంటే సఫారీ బ్యాటర్లు మెరుగ్గా బ్యాటింగ్ చేశారని, ఈ విజయానికి వారు అర్హులని పేర్కొంది. జట్టుగా తాము చాలా మెరుగవ్వాల్సి ఉందని, ముఖ్యంగా బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని హర్మన్‌ప్రీత్ అభిప్రాయపడింది.
'ఇది చాలా టఫ్ మ్యాచ్. ఇరు జట్లు అద్భుతంగా ఆడాయి. మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలినా 250 పరుగులు చేయగలిగాం. కానీ సఫారీ బ్యాటర్లలో క్లో, డిక్లెర్క్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ అని వారు చూపించారు. మా కంటే వారు మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. ఈ విజయానికి పూర్తి అర్హులు.
రిచా ఘోష్ ఎప్పూడా ఇలాంటి ప్రదర్శనలే ఇస్తోంది. ఆమె మ్యాచ్‌ను ములపు తిప్పగల వ్యక్తి. ఈ రోజు ఆమె ఆడిన విధానానికి మేం ఫిదా అయ్యాం. భారీ షాట్స్ ఆడటం ఆమె నైజం. అలవోకగా సిక్సర్లు బాదుతుంది. మా ఇన్నింగ్స్‌లో ఆమె బ్యాటింగ్ అద్భుతం.. అమోఘం. ఈ టోర్నీ ఆసాంతం ఆమె ఇదే జోరు కొనసాగించాలని ఆశిస్తున్నా.

టాప్ ఆర్డర్‌గా మేం బాధ్యత తీసుకోలేదు. వరుసగా వికెట్లు కోల్పోయాం. మేం మా బ్యాటింగ్ తీరును మార్చుకోవాలి. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోతున్నాం. ఈ వైఫల్యాల నుంచి మేం చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే గత మూడు మ్యాచ్‌ల్లో మేం చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేశాం. జట్టుగా కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకోవాలి.
భారీ లక్ష్యాలను నమోదు చేయడానికి కావాల్సిన విషయాలు గురించి చర్చించాలి. ఇది సుదీర్ఘమైన టోర్నీ. ఈ రోజు ఓడినా.. చాలా సానుకూలతలు ఉన్నాయి. మాకు ముందు ముందు బిగ్ గేమ్స్ ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే సానుకూల ధృక్పథంతో సరైన పనులు చేస్తూ ఆటను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగాలి.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్(77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో) ఒంటరి పోరాటం చేయగా.. స్నేహ్ రాణా(24 బంతుల్లో 6 ఫోర్లతో 33), ప్రతికా రావల్(56 బంతుల్లో 5 ఫోర్లతో 37) పర్వాలేదనిపించారు.
అనంతరం సౌతాఫ్రికా 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసి గెలుపొందింది. నదైన్ డిక్లెర్క్(54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 84 నాటౌట్), కెప్టెన్ లారా వోల్వార్ట్(111 బంతుల్లో 8 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించగా.. క్లో ట్రైయాన్(66 బంతుల్లో 5 ఫోర్లతో 49) మెరుపులు మెరిపించింది.