న్యూజిలాండ్ తమ కంటే అత్యుత్తమ క్రికెట్ ఆడటంతోనే టీ20 ప్రపంచకప్ 2024లో శుభారంభం అందుకోలేకపోయామని టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని చెప్పింది. ఈ టోర్నీలో తాము ఆశించిన ఆరంభం ఇది ఏ మాత్రం కాదని అభిప్రాయపడింది.
న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 58 పరుగు తేడాతో చిత్తయ్యింది. 161 పరుగుల లక్ష్య చేధనలో అనూహ్యంగా 102 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. బౌలింగ్‌లో 10-15 పరుగులు అదనంగా ఇచ్చినట్లు పేర్కొంది.

'ఈ రోజు మేం అత్యుత్తమ క్రికెట్ ఆడలేదు. ఈ మ్యాచ్‌లో మేం చేసిన తప్పిదాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. టోర్నీలో ముందడుగు వేయాలంటే బలహీతనలను అధిగమించాలి. ఇక నుంచి మాకు ప్రతీ మ్యాచ్ గెలవడం ముఖ్యమే. మేం అత్యుత్తమ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో మేం ఆశించిన రీతిలో రాణించలేకపోయాం.
న్యూజిలాండ్ మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పెద్ద టోర్నీల్లో చిన్న తప్పు కూడా చేయకూడదు. 160-170 పరుగుల లక్ష్యాలను మేం చాలా సార్లు చేధించాం. కానీ ఈ పిచ్‌పై 160 పరుగుల లక్ష్యం అంటే చాలా ఎక్కువ. 10-15 పరుగులు అదనంగా ఇచ్చాం. ఒకానొక దశలో న్యూజిలాండ్ ఆరంభం చూసి.. 180 పరుగులు చేస్తుందేమోననిపించింది. ఈ టోర్నీలో మేం ఆశించిన ఆరంభం ఇది కాదు.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.
ఈ ఓటమి టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది. ఈ టోర్నీలో గ్రూప్-ఏలో ఉన్న భారత్.. తమ తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో తలపడనుంది. హర్మన్‌సేన సెమీస్ చేరాలంటే ఈ మూడు మ్యాచ్‌లు గెలవడంతో పాటు మెరుగైన రన్‌రేట్ సాధించాలి. న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో భారత్ రన్‌రేట్ -2.900 నెగటీవ్‌గా మారింది.
ప్రస్తుతం భారత్ గ్రూప్-ఏలో చిట్ట చివరి స్థానంలో ఉంది. చివరి మూడు మ్యాచ్‌లు గెలిచినా.. ఇతర జట్ల నెట్‌రన్‌రేట్‌పై భారత్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతీ గ్రూప్ నుంచి రెండేసి జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. గ్రూప్-ఏ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ దక్కించుకోవడం ఖాయం. మరో బెర్త్ కోసం భారత్.. పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్‌తో పోటీపడాల్సి ఉంది.
భారత్ సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియా మినహా మిగతా జట్లు రెండేసి మ్యాచ్‌లు ఓడాలి. వాటి రన్‌రేట్ భారత్ కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే భారత్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. లేకుంటే ఇంటిదారి పడుతోంది. టీమిండియా తమ తుదపరి మ్యాచ్ ఆదివారం పాకిస్థాన్‌తో ఆడనుంది