IND vs PAK: ఆ ఒక్క తప్పు చేసి ఉంటే ఓడిపోయేవాళ్లం: హర్మన్‌ప్రీత్ కౌర్
పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోకుండా అనవసర ఒత్తిడికి గురయ్యామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ఈ ఒత్తిడిని కొనసాగించి ఉంటే ఓటమిపాలయ్యేవాళ్లమని తమ తప్పిదాన్ని అంగీకరించింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా దాయాదీ పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన హర్మన్ సేన 64 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మెగా టోర్నీలో శుభారంభం చేసింది.
మా ఫ్యాన్స్‌కు థ్యాంక్స్..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూనే తాము చేసిన తప్పిదాలను తెలియజేసింది. భారీ సంఖ్యలో మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.
'ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా నేను భారత అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. వారు అద్భుతంగా సపోర్ట్ చేశారు. వారు ఎల్లప్పుడూ మాకు అండగా నిలుస్తారు. కాబట్టి మేం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఆ ఇద్దరి వల్లే విజయం..
జట్టుకు అవసరమైనప్పుడల్లా స్మృతి మంధాన, దీప్తి శర్మ అండగా నిలుస్తారు. ఎప్పుడూ టీమ్‌ను ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రోజు వారిద్దరూ ఆడిన విధానం అద్భుతం. వారి ప్రదర్శన నాకు చాలా సంతోషాన్నిచ్చింది.

ఇది మంచి పిచ్. కానీ ఆరంభంలో మేమే అనవసర ఒత్తిడికి గురయ్యాం. కానీ ఆ తర్వాత స్మృతి, నేను మ్యాచ్‌ను నియంత్రించే ప్రయత్నం చేశాం. ఆపై అనుకున్నది సాధించాం. రిచా ఘోష్ బ్యాటింగ్ ఆర్డర్ నిర్ణయం నా చేతుల్లో లేదు. నేనైతే ఆమెను ఓపెనర్‌గా పంపాలని అనుకుంటాను. కానీ ఆమెకు ఒక నిర్దిష్టమైన పాత్ర ఉంది. ఆమె చాలా బాగా రాణిస్తోంది. ఈ రోజు ఆమె అసాధారణ ఇన్నింగ్స్ ఆడింది.
మా ఫీల్డింగ్ బాగుంది..
మా ఫీల్డింగ్ ముందుగా తడబడినా ఆ తర్వాత మెరుగయ్యాం. క్రికెట్‌లో క్యాచ్‌లను అందుకుంటేనే మ్యాచ్‌లు గెలుస్తాం. మేం మెరుగైన ఫీల్డింగ్ చేయాలనుకున్నాం. మా ఫీల్డింగ్ విధానం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.
ఈ టోర్నీలో ప్రతీ లీగ్ మ్యాచ్ కీలకమైనదే. ఈ రోజు మేం గెలిచిన విధానం చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే లీగ్ చివర్లో ఈ భారీ విజయం మాకు ఉపయోగపడుతుంది. నాకు ఎలాంటి గాయం కాలేదు. ఫిట్‌గానే ఉన్నాను.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.
మెరిసిన స్మృతి, దీప్తి
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. స్మృతి మంధాన(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) హాఫ్ సెంచరీతో రాణించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(35 బంతుల్లో 4 ఫోర్లతో 36), రిచా ఘోష్(17 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో సదియా ఇక్బాల్, ఫాతిమా సనా రెండేసి వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్, రమీన్ షమీమ్ తలో వికెట్ తీసారు.
అనంతరం పాకిస్థాన్ 17 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. మునీబా అలీ(35 బంతుల్లో 5 ఫోర్లతో 41) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ(5/10) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. తెలుగుతేజం శ్రీచరణి(3/21) తీన్మార్ బౌలింగ్‌తో అదరగొట్టింది. షెఫాలీ వర్మకు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

