ఆ ఇద్దరి వల్లే ఈ చారిత్రాత్మక విజయం: హర్మన్‌ప్రీత్ కౌర్
దీప్తి శర్మ, షెఫాలీ వర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నామని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. షెఫాలీ వర్మ బౌలింగ్ తమ విజయానికి బాటలు వేసిందని అభిప్రాయపడింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన హర్మన్‌సేన 52 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 48 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ప్రపంచకప్‌ను ముద్దాడింది. మహిళల క్రికెట్‌లో భారత జట్టుకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం గమనార్హం.
ఈ విజయానంతరం మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. తమకు అండగా నిలిచిన ప్రేక్షకులతో పాటు బీసీసీఐ, సపోర్ట్ స్టాఫ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ విజయం ముగింపు కాదని, ఆరంభమేనని, భవిష్యత్తులో మరిన్ని టైటిల్ సాధిస్తామని స్పష్టం చేసింది.
షెఫాలీ బౌలింగ్ టర్నింగ్ పాయింట్..
'ఈ టోర్నీ ఆసాంతం మా కష్ట, సుఖాల్లో అండగా నిలిచిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. వారి మద్దతు వెల కట్టలేనిది. ఈ టోర్నీలో మేం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడినా మా ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. పరిస్థితులను మార్చే సామర్థ్యం మాకు ఉందని తెలుసు. జట్టులోని ప్రతీ ఒక్కరు సానుకూలంగా ఉన్నారు. విజయం కోసం ఏం చేయాలనే స్పష్టత ప్రతీ ప్లేయర్‌కు ఉంది. ప్రతీ ఒక్కరు జట్టు విజయం కోసం రాత్రి, పగలూ కష్టపడ్డారు. ఈ జట్టుకు విశ్వవిజేతగా నిలబడేందుకు అన్ని విధాల అర్హత ఉంది.

లారా, సునే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షెఫాలీని చూశాను. వెంటనే ఆమెతో బౌలింగ్ చేయించాలని అనిపించింది. ఈ రోజు ఆమె ఆడుతున్న తీరు విజయం మాదేననే నమ్మకాన్ని కలిగించింది. వెంటనే నా మనసు చెప్పినట్లు ఆమెతో కనీసం ఒక ఓవర్ వేయించాలనుకున్నాను. కానీ అదే మాకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆమె జట్టులోకి వచ్చినప్పుడే 2-3 ఓవర్లు బౌలింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలని చెప్పాం. అందుకు ఆమె 10 ఓవర్లు కూడా వేస్తానని బదులిచ్చింది. ఈ గెలుపులో ఆమెకు క్రెడిట్ ఇవ్వాలి. చాలా సానుకూలంగా ఉంటూ జట్టు కోసం నిలబడింది. ఆమెకు నా సెల్యూట్.
వారి భయాన్ని క్యాష్ చేసుకున్నాం..
ఈ రోజు పిచ్ చాలా భిన్నంగా ఉంది. ఫైనల్లో ఎప్పుడూ కొంచెం అదనపు ఒత్తిడి ఉంటుంది. దాంతో మేం చేసిన పరుగులు సరిపోతుందని భావించాం. ఈ మ్యాచ్‌లో ఓడినా సౌతాఫ్రికా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. చివర్లో వారు కాస్త భయపడ్డారు. ఆ అవకాశాన్ని మేం సద్వినియోగం చేసుకున్నాం. సరైన సమయంలో దీప్తి శర్మ వచ్చి వికెట్లు తీసింది.
ప్రతీ ప్రపంచకప్ తర్వాత విజేతగా నిలవడం గురించి ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లం. గత రెండేళ్లుగా అమోల్ సార్ మాతో ఉన్నారు. అతను ఎప్పుడూ ఏదైనా ప్రత్యేకంగా చేయాలని, పెద్ద సందర్భం కోసం సిద్దంగా ఉండాలని చెబుతూ ఉండేవారు. ఈ గెలుపు క్రెడిట్ మా సపోర్ట్ స్టాఫ్‌తో పాటు బీసీసీఐకి కూడా ఇవ్వాలి. మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలిచారు. వారి ప్రోత్సాహంతోనే మేం విశ్వవిజేతగా నిలిచాం.
ఇది ఆరంభం మాత్రమే. మేం ఈ లైన్‌ను ధాటాలనుకున్నాం. మా తదుపరి ప్రణాళిక ఈ విజయాన్ని అలవాటు చేసుకోవడమే. ఇలాంటి మరిన్ని క్షణాలను పొందాలనుకుంటున్నాం. మేం మా ఆటను మెరుగుపర్చుకొని మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం. చివరిగా ఈ విజయం ముగింపు కాదు. కేవలం ఆరంభం మాత్రమే.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications