వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే తన తప్పిదం వల్లే ముంబై ఇండియన్స్ పరాజయం పాలైందని ఆ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.
చివరి 13 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన సమయంలో తాను ఔటవ్వడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని తెలిపింది. తన వికెట్ కోల్పోయిన అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై బ్యాటర్లు ఒత్తిడికి చిత్తయ్యారని, ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారని చెప్పుకొచ్చింది.

12 బంతుల్లో నో బౌండరీ..
'చివరి 12 బంతుల్లో మా విజయానికి ఒక్క బౌండరీ అవసరమైంది. కానీ మేం ఆ బౌండరీ కొట్టలేకపోయాం. ప్రతీ మ్యాచ్ మనకు ఓ గుణపాఠాన్ని నేర్పిస్తోంది. ఒత్తిడిలో ఎలా ఆడాలనేది ఈ మ్యాచ్‌ను చూసి నేర్చుకోవాలి. నా వికెట్ కోల్పోయిన తర్వాత మా బ్యాటర్లు ఒక్కరు కూడా స్వేచ్చగా ఆడలేకపోయారు.
టర్నింగ్ పాయింట్..
తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. అదే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓడినా టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చాం. ఈ సీజన్‌లో మా ప్రయాణం కాస్త అటు ఇటుగా సాగింది. గత సీజన్‌లో మేం సమష్టి ప్రదర్శనలతో ఛాంపియన్‌గా నిలిచాం. కానీ ఈ సారి ఆ జోరును కొనసాగించలేకపోయాం.
ఒక గెలుపు, ఒక ఓటమి అన్నట్లు ముందుకు సాగాం. కానీ ఈ సీజన్‌తో మేం చాలా నేర్చుకున్నాం. వచ్చే ఏడాది మరింత పకడ్బందీగా ప్రిపేర్ అయ్యి బరిలోకి దిగుతాం. టైటిల్ గెలుచుకునే ప్రయత్నం చేస్తాం.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.

ఎలీస్ పెర్రీ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ(50 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 66) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది.
అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులే చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్(30 బంతుల్లో 4 ఫోర్లతో 33) పోరాడినా ఫలితం దక్కలేదు. శ్రేయాంక పాటిల్(2/16) రెండు వికెట్లు తీయగా.. ఎలీస్ పెర్రీ, ఆశ(1/13), మోలనూ తలో వికెట్ తీసారు. శ్రేయాంక పాటిల్ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి హర్మన్‌ప్రీత్ కౌర్ స్టంపౌట్‌గా వెనుదిరిగింది. ఆమె చేసిన తప్పిదం ముంబై పతనాన్ని శాసించింది.