అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ముందు పాకిస్థాన్ పేసర్ హరీస్ రౌఫ్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. తాను ఎలాంటి తప్పిదం చేయలేదని గట్టిగా వాదించినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ వివాదాస్పద సంజ్ఞలు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌కు చెందిన జెట్ ఫ్లైట్స్‌ను కూల్చేశామని ప్రేక్షకులకు తెలియజేస్తూ .. 6-0 అనే సంజ్ఞలు చేశాడు.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సాయుధ బలగాలు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిభిరాలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల సమయంలో భారత్‌కు చెందిన 6 రాఫెల్ యుద్ద విమానాలను కూల్చినట్లు పాకిస్థాన్ అబద్దపు ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఇప్పటి వరకు ప్రపంచానికి చూపించలేదు. కానీ భారత్‌పై తామే యుద్దం గెలిచామని సంబరాలు చేసుకుంది. భారత్‌తో మ్యాచ్‌లోనూ ఇదే విషయాన్ని తెలియజేస్తూ హరీస్ రౌఫ్ 6-0 సంజ్ఞలు చేశాడు. అంతేకాకుండా కవ్వింపులకు పాల్పడుతూ భారత్ ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు.

అయితే హరీస్ రౌఫ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా భారత అభిమానులు అతన్ని సోషల్ మీడియా వేదికగా ఏకీపారేసారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అతన్ని ఐసీసీ వివరణ కోరగా.. తాను భారత్‌ను ఉద్దేశించి ఆ సంజ్ఞలు చేయలేదని వాదించినట్లు సమాచారం. హాఫ్ సెంచరీ అనంతరం గన్ ఎక్కుపెట్టి సంబరాలు చేసుకున్న పాకిస్థాన్ ఓపెనర్ సహిబ్‌జాద్ ఫర్హాన్ సైతం.. ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన సంబరాల వెనుక ఎలాంటి రాజకీయపరమైన చర్య లేదని, గతంలో ధోనీ, కోహ్లీ కూడా ఇలా సంబరాలు చేసుకున్నారని ఫర్హాన్ ఐసీసీకి వివరణ ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఈ ఇద్దరి మ్యాచ్ ఫీజులో ఐసీసీ కోత విధించే అవకాశం ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనుంది. క్రికెట్ మ్యాచ్‌లో రాజకీయపరమైన విషయాలను ప్రస్తావించడం, సంజ్ఞలు చేయడం రూల్స్‌కు విరుద్దం. ఇక పాక్‌పై విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితం చేసిన సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ఐసీసీ మందలించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయవద్దని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.