ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో తమ కెప్టెన్‌ను మారుస్తూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం ఆ జట్టు ఆటతీరుపై ప్రభావం చూపుతోంది. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రతీ మ్యాచ్‌లోనూ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను గేలి చేస్తున్నారు. అతని నిర్ణయాలను భూతద్దంతో చూస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటగాళ్ల నుంచి కూడా హార్దిక్ పాండ్యాకు సహకారం లభించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. చాహల్ (3/11), బౌల్ట్ (3/22), బర్గర్ (2/32) ముంబై పతనాన్ని శాసించారు. ట్రెంట్ బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ, నమన్ ధిర్, డెవాల్డ్ బ్రెవిస్ గోల్డెన్ డక్ అయ్యారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 15.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రియాన్ పరాగ్ (54 నాటౌట్)అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అయితే ఈ మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ అభిమానులు ఎగతాళి చేశారు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు తమ నినాదలతో విసిగించారు. చివరకు రోహిత్ శర్మ జోక్యం చేసుకొని అభిమానులను వారించాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై స్పందించిన రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ మార్పు అనేది ఫ్రాంచైజీల ఇష్టమని, డబ్బులు పెట్టేది వారు కాబట్టి, నచ్చిన ఆటగాళ్లను కెప్టెన్ చేస్తారన్నాడు. అయితే ముంబై ఇండియన్స్ ఈ విషయాన్ని మెరుగ్గా డీల్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.
'రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య ఉన్న కెప్టెన్సీ సమస్యను ముంబై ఇండియన్స్ మెరుగ్గా హ్యాండిల్ చేయాల్సింది. కానీ కెప్టెన్సీ మార్పు అనేది ఫ్రాంచైజీ ఓనర్ల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. డబ్బులు పెట్టేది వారే కాబట్టి వారికి నచ్చిన ఆటగాళ్లను కెప్టెన్ చేస్తారు.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.