ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ లీగ్‌లో ఆ జట్టు సాధించిన విజయాలు.. నమోదు చేసిన రికార్డులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఐపీఎల్‌లో అసాధారణ విజయాలను అందుకోవడమే కాకుండా.. ఎంతో మంది కుర్రాళ్లను టీమిండియాకు పరిచయం చేసింది.
అంబటి రాయుడు, పాండ్యా బ్రదర్స్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లను టీమిండియాకు అందించింది. ముంబై ఇండియన్స్‌కు ఎంపికైతే దశ మారినట్లేనని ప్రతీ ఆటగాడు అనుకునేలా ఆ జట్టు ప్రభావం చూపింది. అలాంటి జట్టు ఇప్పుడు అంతర్గత విబేధాలతో రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట టీమ్‌మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలతో ఈ విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి కొనుగోలు చేసింది. అతని కోసం గుజరాత్ టైటాన్స్‌కు అనధికారికంగా చాలా డబ్బును ఇచ్చింది.
హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకున్న వెంటనే తమ సారథిగా ప్రకటించింది. టీమ్ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు విజేతగా నిలబెట్టిన ఆ జట్టు మాజీ కెప్టెన్, టీమిండియా సారథి రోహిత్ శర్మ అభిమానులకు ఇది అవమానంగా అనిపించింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ వాళ్లు ముంబై ఫ్రాంచైజీపై విమర్శలు గుప్పించారు.
కొందరైతే ఆ జట్టు సోషల్ మీడియా పేజీలను అన్‌ఫాలో చేశారు. అయినా ముంబై తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కెప్టెన్సీ మార్పు వ్యవహారంపై రోహిత్ శర్మ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతని సతీమణి రితికా సజ్దే సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ తీరును తప్పుబట్టింది. 'చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు'అని కామెంట్ చేసింది.
మరోవైపు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతించలేకపోయాడు. రోహిత్ తర్వాత ముంబై సారథ్య బాధ్యతలు అందుకోవాలని భావించిన బుమ్రాకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం నచ్చలేదు. సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని పరోక్షంగా తెలియజేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ సైతం గుండెపగిలిందని కామెంట్ చేశాడు.
ఈ క్రమంలోనే ముంబై టీమ్.. రోహిత్ వర్సెస్ హార్దిక్‌గా విడిపోయినట్లు అర్థమవుతోంది. రోహిత్, సూర్య, బుమ్రా ఒక టీమ్‌గా ఉండగా.. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ తదితర ఆటగాళ్లు మరో గ్రూప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాకు ఇషాన్ కిషన్ క్లోజ్‌గా ఉండటం నచ్చకనే రోహిత్.. జితేశ్ శర్మను తీసుకొచ్చి తుది జట్టులో చోటు లేకుండా చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.