ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో సూపర్ 8 పోరుకు ముందు జరిగిన సౌతాఫ్రికా X వెస్టిండీస్ మ్యాచ్‌ను చూశామని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవడంతో తమపై ఉన్న అదనపు ఒత్తిడిని తగ్గిందని వెల్లడించాడు. సెమీఫైనల్ రేసులో టీమిండియా నిలవాలంటే వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా గెలవడం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దాంతో యావత్ భారత్ సౌతాఫ్రికా గెలవాలని కోరుకుంది. ఆ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో రన్‌రేట్ లెక్కలతో సంబంధం లేకుండా పోయింది.
జింబాబ్వేతో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ అవకాశాలను సజీవం చేసుకుంది. వెస్టిండీస్‌తో ఆదివారం కోల్‌కతా వేదికగా జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే సెమీస్ చేరనుంది. ఈ మ్యాచ్ రద్దయినా.. ఓడినా.. భారత్ కథ ముగియనుంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. గుడ్డిగా కాకుండా టైమింగ్‌తో షాట్లు కొట్టగలనని తెలుసుకున్నానని చెప్పాడు. బౌలింగ్‌లో తనకు పూర్తి కోటా ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

' జట్టు విజయంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. 23 బంతుల్లో 50 పరుగులు వినడానికి బాగుంది. కానీ, ఆ సమయంలో పరిస్థితిని బట్టి నేను నా ఆటను మార్చుకోవాల్సి వచ్చింది. నేను చెప్పదలచుకున్నది ఏంటంటే.. నేను బంతిని మరీ గట్టిగా కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు నాకు అనిపించింది. కానీ టైమింగ్‌తో కూడా నేను సిక్సర్లు కొట్టగలనని మ్యాచ్ జరుగుతుండగానే నాకు అర్థమైంది. నా గత కొన్ని మ్యాచ్‌ల్లో నేను అనుకున్నది చేయలేకపోయాను. కాబట్టి రిథమ్ అందుకోవడానికి ఈ మ్యాచ్ నాకు బాగా ఉపయోగపడింది. నా ఆట పట్ల చాలా సంతృప్తిగా ఉంది.

మేమందరం సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్‌పై కన్నేసి ఉంచాం. ఇప్పుడు అంతా మంచి క్రికెట్ ఆడటం, మన నైపుణ్యాలను నమ్ముకోవడం, ఒత్తిడిని తట్టుకోవడం, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే ఆధారపడి ఉంటుంది. మేం ఆ మ్యాచ్‌ను గమనించాం. కానీ అది ముగియగానే మా దృష్టిని ఈ మ్యాచ్‌పైకి మళ్లించాం.
బౌలింగ్ విషయానికి వస్తే, చాలా బాగుంది. నాకు కొత్త బంతితో బౌలింగ్ చేయడం ఇష్టం. బంతి స్వింగ్ అయ్యింది. దేవుడి దయ వల్ల నా దగ్గర ఇన్‌స్వింగ్, అవుట్‌స్వింగ్ చేసే నైపుణ్యం ఉంది. నేను దానిని నిజంగా ఆస్వాదిస్తాను. ఇది నాకు వికెట్లు తీసే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా.. బ్యాటర్లకు కూడా సవాలు విసురుతుంది. నా బౌలింగ్ పట్ల చాలా సంతృప్తిగా ఉంది. నేను ఇంకా ఒక ఓవర్ బౌలింగ్ చేయాల్సింది. ఇక్కడి నుంచి వెళ్ళాక ఆ ఓవర్ వేస్తాను.'అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ 21 పరుగులే ఇచ్చాడు.
