
దుబాయ్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన జీవితంలోని సూపర్ హీరోలు ఎవరో చెప్పాడు. తనకు జన్మనిచ్చిన తండ్రి హిమాన్షు పాండ్యా, తనను వివాహం చేసుకున్న నటాషా స్టాంకోవిక్ తోపాటు చిన్నప్పటి నుంచి తనకు అండగా నిలిచిన సోదరుడు కృనాల్ పాండ్యా, కెరీర్‌లో తనకు మార్గనిర్దేశకుడైన మహేంద్ర సింగ్ ధోనీలు సూపర్ హీరోలని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన సరదా చిట్‌చాట్‌లో హార్దిక్ ఈ విషయాలను వెల్లడించాడు.
అయితే ఈ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడంపై అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మతో హార్దిక్ మంచి సంబంధాలున్న నేపథ్యంలో అతని సూపర్ హీరోస్ జాబితాలో హిట్ మ్యాన్ పేరుంటుందని భావించామని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా కెరీర్ క్లిష్ట స్థితిలో అండగా నిలిచిన విరాట్ కోహ్లీ పేరు కూడా చెబుతాడనుకున్నామని ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సూపర్ హీరోస్ అంశం నెట్టింట చర్చనీయాంశమైంది.
ఈ ఏడాది ఆరంభంలో హార్దిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. తండ్రి హిమాన్షు పాండ్యా అంటే హార్దిక్ పాండ్యాకి చాలా ఇష్టం. అన్న కంటే ముందు టీమిండియాకి ఆడిన హార్దిక్ పాండ్యా.. తన సంపాదనతో హిమాన్షు పాండ్యాకి ఖరీదైన కారుని బహూకరించాడు. అప్పట్లో ఓ విదేశీ టూర్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా.. కారుని బుక్ చేసి షోరూమ్‌కి తండ్రిని తీసుకెళ్లాల్సిందిగా కృనాల్, తన కజిన్‌ని కోరాడు. అక్కడ హిమాన్షుకి అందరూ కలిసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
సూరత్‌లో హిమాన్షు పాండ్య అప్పట్లో కార్ల ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు. అయితే.. కొడుకుల క్రికెట్ ట్రైనింగ్ కోసం ఆ బిజినెస్‌ని వదిలేసి ఫ్యామిలీని వడోదరికి మార్చేశారు. అక్కడే భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పించారు. మొత్తానికి అతని కష్టం ఫలించింది. హార్దిక్, కృనాల్ పాండ్యా టీమిండియాకి ఆడారు. అలానే ఐపీఎల్‌లోనూ ముంబయి ఇండియన్స్ టీమ్‌కి కలిసి ఆడుతూ రూ. కోట్లలో సంపాదిస్తున్నారు. ఒకప్పుడు భోజనానికి డబ్బుల్లేక కేవలం బన్‌లతో కడుపు నింపుకుని మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని పాండ్యా బ్రదర్స్ ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు.
గత ఏడాది నటాసాని హార్దిక్ పాండ్యా వివాహం చేసుకోగా.. వారికి అగస్త్య పుట్టిన విషయం తెలిసిందే. ప్రేమించి నటాసాతో లివింగ్ రిలేషన్‌లో ఉన్న పాండ్యా.. తండ్రైన తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక హార్దిక్, కృనాల్ మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేంద్ర సింగ్ ధోనీని పాండ్యా తన మెంటార్‌గా భావిస్తాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ ఆడటానికి కూడా ధోనీనే కారణం. అతనే సెలెక్టర్లతో పట్టుబట్లాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ టోర్నీ హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. అఫ్గాన్‌తో రాణించినప్పటికీ.. అంతకు ముందు కీలకమైన పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు. అది టీమ్ వైఫల్యంపై ప్రభావం చూపింది.