టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. భారత బ్యాటర్ సంజూ శాంసన్ నాన్‌స్ట్రైకర్ వైపు షాట్ ఆడగా.. బౌలర్ చేతులు తాకుతూ వెళ్లిన బంతి వికెట్లను తాకింది. అప్పటికే హార్దిక్ పాండ్యా క్రీజు దాటడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యాకు రాక రాక బ్యాటింగ్ రాగా.. ఒకే ఒక్క బంతి ఆడి ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 'పాపం హార్దిక్ పాండ్యా.. గాశారం బాలేదుగా..'అని ఒక్కరంటే.. ఒక్క బంతికే రనౌటైన హార్దిక్ 20 ఓవర్లు ఫీల్డింగ్ చేయాలని, ఇంత కంటే దరిద్రం మరొకటి ఉండదని సెటైర్లు పేల్చుతున్నారు.

జితేన్ రామనంది వేసిన 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి అభిషేక్ శర్మ క్యాచ్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన హార్దిక్ సింగిల్ తీసి సంజూకు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతిని సంజూ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. జితేన్ ఎడమవైపు డైవ్ చేసి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతని చేతులను తాకిన బంతి నేరుగా నాన్‌స్ట్రైక్ వికెట్లను పడగొట్టింది. అప్పటికే హార్దిక్ క్రీజు దాటడంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(5) రెండో ఓవర్‌లోనే క్లీన్ బౌల్డ్ కాగా.. సంజూతో కలిసి అభిషేక్ చెలరేగాడు. తనదైన శైలిలో భారీ షాట్స్ ఆడటంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం అభిషేక్ శర్మ(38), హార్దిక్ పాండ్యా(1) వెనుదిరగ్గా.. అక్షర్ పటేల్‌తో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దూకుడుగా ఆడిన అక్షర్ పటేల్(26)ను కలీమ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.