
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ అనంతరం తనను జట్టు నుంచి తప్పించలేదని, తానే టీమ్ సెలెక్షన్‌కు దూరంగా ఉన్నానని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. గత రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతున్నహార్దిక్ పాండ్యా భారత జట్టులో వస్తూ పోయాడు. టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన హార్దిక్.. ఆ తర్వాత టీమిండియాకు దూరంగా ఉన్నాడు.
దాంతో అందరూ సెలెక్షన్ కమిటీ అతనిపై వేటు వేసిందని భావించారు. మళ్లీ ఐపీఎల్ 2022 సీజన్‌తో మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు కెప్టెన్‌గా దుమ్మురేపి గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలబెట్టాడు. ఈ ప్రదర్శనతో సౌతాఫ్రికాతో ఈ నెల 9 నుంచి జరగనున్న 5 టీ20ల సిరీస్‌కు టీమిండియా పిలుపును అందుకున్నాడు.
ఐపీఎల్‌లో తన ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన హార్దిక్ పాండ్యా.. గుజరాత్ ఫ్రాంఛైజీ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో.. దేశం కోసం అంతకంటే ఎక్కువగానే కష్టపడతానంటూ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. అలాగే తనను ఎవరూ భారత జట్టు నుంచి తప్పించలేదని, తనకు తానుగా విశ్రాంతి కోరానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
'టీమిండియా నుంచి నన్ను తప్పించారంటూ చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. నిజానికి అది నా వ్యక్తిగత నిర్ణయం. నేను సెలవు తీసుకున్నాను అంతే. మనం అందుబాటులో ఉండి కూడా జట్టుకు ఎంపిక కాకపోతే అప్పుడు జట్టు నుంచి తప్పించినట్లు అవుతుంది.
కానీ నా విషయంలో అలా జరగలేదు. సుదీర్ఘకాలం పాటు విరామం తీసుకోవాలనుకుంటున్నానన్న నా అభ్యర్థనను మన్నించిన బీసీసీఐకి రుణపడి ఉంటాను. సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలని వారు నన్ను బలవంతం చేయలేదు. అంతా బాగుంది కాబట్టే ఇప్పుడు పాత హార్దిక్ పాండ్యాను మీరు చూడగలుగుతున్నారు'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.