టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 2000 పరుగులతో పాటు 100 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. మరే భారత ఆటగాడు కూడా కనీసం 1000 పరుగులు, 100 వికెట్లు తీయలేదు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో హార్దిక్ పాండ్యా ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సంగతి తెలిసిందే. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన హార్దిక్.. తొలి 7 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. 16 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని భారత్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ టీ20ల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఈ సిరీస్‌లోనే 100 వికెట్లు మైలురాయి అందుకున్న హార్దిక్ పాండ్యా.. టీ20ల్లో 100 వికెట్లతో పాటు 2000 పరుగులు చేసిన తొలి పేస్ ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ స్పిన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 149 వికెట్లు, 2551 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు.
మలేసియా స్పిన్ ఆల్‌రౌండర్ వీరణ్‌దీప్ సింగ్ 109 వికెట్లతో పాటు 3180 పరుగులు చేయగా.. అఫ్గానిస్థాన్ స్పిన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ 2147 పరుగులతో పాటు 104 వికెట్లు తీసాడు. జింబాబ్వే స్పిన్ ఆల్‌రౌండర్ సికిందర్ రాజా 102 వికెట్లతో పాటు 2883 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 101 వికెట్లతో 2002 పరుగులు చేశాడు.
12 - యువరాజ్ సింగ్ vs ఇంగ్లండ్, డర్బన్, 2007 వరల్డ్ కప్
16 - హార్దిక్ పాండ్యా vs సౌతాఫ్రికా, అహ్మదాబాద్, 2025*
17 - అభిషేక్ శర్మ vs ఇంగ్లండ్, వాంఖడే, 2025
18 - కేఎల్ రాహుల్ vs స్కాట్లాండ్, దుబాయ్, 2021
18 - సూర్యకుమార్ యాదవ్ vs సౌత్ ఆఫ్రికా, గువహటి, 2022
ఈ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్ వర్మ(42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 73), హార్దిక్ పాండ్యా(25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఓట్నిల్ బార్ట్‌మన్, జార్జ్ లిండే తలో వికెట్ తీసారు.
అనంతరం సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేసి ఓటమిపాలైంది. క్వింటన్ డికాక్(35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(4/53) నాలుగు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా..అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసాడు. జస్‌ప్రీత్ బుమ్రా(2/17) రెండు వికెట్లు పడగొట్టాడు.