అహ్మదాబాద్: కోల్‌కతా నైట్ రైడర్స్ బిగ్ హిట్టర్ రింకూ సింగ్ దెబ్బతో యశ్ దయాల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. జ్వరంతో బెడ్‌కే పరిమితమైన అతను 7-8 కిలోల బరువు తగ్గాడని చెప్పాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్‌లో రింకూ సింగ్ వరుసగా 5 సిక్స్‌లు బాది కేకేఆర్‌కు సంచలన విజయాన్నందించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో రింకూ సింగ్ హీరో కాగా.. యశ్ దయాల్ బెడ్‌కు పరిమితమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను యశ్ దయాల్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర విషయం చెప్పాడు. రింకూ సింగ్ వేసిన ఆ ఓవర్ తర్వాత యశ్ దయాల్ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లాడని చెప్పాడు.

'ఈ సీజన్‌లో యశ్ దయాల్ మళ్లీ బరిలోకి దిగుతాడా? లేదా? అనేది నేను చెప్పలేను. ఎందుకంటే అతను ఆ మ్యాచ్ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. రెండు వారాల్లో 7-8 కిలోల బరువు తగ్గాడు. ఆ మ్యాచ్ తర్వాత యశ్ దయాల్ తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లాడు.
అదే సమయంలో అతనికి వైరల్ ఫివర్ కూడా వచ్చింది. దాంతో అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా చెడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను మ్యాచ్ ఆడే అవకాశాలు లేవు. అయితే ఆటలో ఇవన్నీ సహజం. ఒకరి గెలిచినప్పుడు మరొకరు ఓడిపోవడం సహజం...
అయితే అతను మళ్లీ క్రికెట్‌లోకి వస్తాడు. మరింత బలంగా రీఎంట్రీ ఇస్తాడు. కానీ దానికి చాలా సమయం పడుతుంది. అతనికి టీమ్ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. యశ్ దయాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన వెటరన్ పేసర్ మోహిత్ శర్మ సూపర్ బౌలింగ్‌తో జట్టుకు విజయాలందిస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు డిఫెండ్ చేశాడు.
ఆ ఓవర్‌లో 4 వికెట్లు కోల్పోయిన లక్నో.. 4 పరుగులు మాత్రమే చేసి 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచులు ఆడిన మోహిత్ శర్మ, 6 వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్‌కు కీలక బౌలర్‌గా మారాడు.