తమ ఓపెనర్ల వైఫల్యం కారణంగానే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. భారీ లక్ష్య చేధనలో పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయడం చాలా కీలకమని, కానీ తమ బ్యాటర్లు తడబడ్డారని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వాంఖడే గడ్డపై ఆర్‌సీబీ విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. రెండు బిగ్ షాట్స్ దూరంలో విజయం చేజారిందని అభిప్రాయపడ్డాడు. 'ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. రెండు షాట్స్ దూరంలో విజయం చేజారింది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. పరుగులను అడ్డుకోవడం బౌలర్లకు కష్టంగా మారింది. కానీ మా బౌలర్లు.. బ్యాటర్లను కాస్త కట్టడి చేయాల్సింది. ఈ విషయంలో నేను బౌలర్లను మరింత ఇబ్బంది పెట్టలేను. బౌలర్లకు ఇది కఠినమైన పిచ్. మాకు బ్యాటర్లను అడ్డుకునే ఆప్షనే లేకుండా పోయింది.

అందుకే నంబర్3లో మార్పు..
రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వడంతోనే గత మ్యాచ్‌లో నెంబర్ 3లో ఆడిన నమన్ ధిర్‌ను డౌన్ ది ఆర్డర్ ఆడించాం. నమన్ ఎప్పుడూ డౌన్‌ది ఆర్డర్ ఆడుతాడు. గత మ్యాచ్‌లో రోహిత్ లేడు. అందుకే నమన్ ధిర్‌ను అప్‌ది ఆర్డర్ ఆడించాం. అతను అప్‌ది ఆర్డర్‌తో పాటు డెత్ ఓవర్లలో కూడా ఆడగలడు. రోహిత్ తిరిగి రావడంతో నమన్‌ను డౌన్ ది ఆర్డర్ ఆడించాం. తిలక్ అద్భుతంగా ఆడాడు.
గాయం కారణంగానే బయటకు..
గత మ్యాచ్‌లో చాలా విషయాలు జరిగాయి. జనాలు చాలా ఊహించుకున్నారు. కానీ ఆ మ్యాచ్‌కు ముందు రోజు అతని తలకు దెబ్బ తగిలిందనే విషయం ఎవరికీ తెలియదు. తిలక్‌ను బయటకు పంపించడం వ్యూహాత్మక నిర్ణయం. ఎందుకంటే అతను తల గాయంతో ఇబ్బంది పడ్డాడు. దాంతో మా కోచ్ కొత్త బ్యాటర్‌ను పంపించడం ఉత్తమమని భావించాడు. తాజా మ్యాచ్‌లో తిలక్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
పవర్ ప్లే దెబ్బతీసింది..
ఇలాంటి మ్యాచ్‌ల్లో పవర్ ప్లేలో రాణించడం చాలా కీలకం. కొన్ని ఓవర్లలో మేం బంతిని సరిగ్గా మిడిల్ చేయలేకపోయాం. అది మా పతనాన్ని శాసించింది. డెత్ ఓవర్లలో కూడా మేం కొన్ని బంతులు వదిలేసాం. ఈ ప్రపంచంలో బుమ్రా ఉన్న జట్టు ప్రత్యేకంగా నిలుస్తోంది. అతను అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. అతను మా జట్టులో ఉండటం సంతోషించే విషయం. జీవితంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వేయవద్దు. సానుకూల విషయాలను మాత్రమే పట్టించుకోవాలి. అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాలి. ఒకరికొకరు అండగా నిలవాలి. ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నా.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), రజత్ పటీదార్(32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.