బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. రాజస్థాన్ రాయల్స్ అసాధారణ ప్రదర్శన కనబర్చిందని కొనియాడాడు. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు సరైన ముగింపు లభించకపోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసాయన్నాడు. 'ఆరంభంలోనే మేం కష్టాల్లో పడ్డాం.

తిలక్ వర్మ, నెహాల్ వదేరా అసాధారణ బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయిన తర్వాత మేం 180 పరుగులు కూడా చేస్తామని అనుకోలేదు. కానీ తిలక్, నెహాల్ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. అయితే డెత్ ఓవర్లలో మాకు సరైన ముగింపు లభించలేదు. దాంతో మా లక్ష్యానికి 10-15 పరుగులు తక్కువగా చేశాం.
మేం స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేశాం. పవర్ ప్లేలో మాత్రం చాలా విడ్త్ ఇచ్చాం. మొత్తానికి ఈ రోజు బౌలింగ్‌లో మేం దారుణంగా విఫలమయ్యాం. సరైన ప్రదర్శన చేయలేకపోయాం. రాజస్థాన్ రాయల్స్ కూడా అసాధారణ ప్రదర్శన కనబర్చింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆటగాళ్లు చేసిన తప్పిదాల గురించి మాట్లాడటం సరికాదు.
జట్టులో ప్రతీ ఒక్కరు ప్రొఫెషనలే. అందరికి వారి బాధ్యత ఏంటో తెలుసు. మేం చేయాల్సిందల్లా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవడమే. తప్పిదాలను సరిదిద్దుకొని తదుపరి మ్యాచ్‌కు సిద్దం కావాలి. జట్టుగా పురోగతి సాధించడం చాలా ముఖ్యం. ఆటగాళ్లకు అండగా ఉండటం నాకిష్టం. మా ప్రణాళికలకు కట్టుబడి గుడ్ క్రికెట్ ఆడటంపై ఫోకస్ పెడుతాం. బేసిక్ తప్పిదాలు చేయకుండా చూసుకుంటాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) హాఫ్ సెంచరీతో రాణించగా.. యువ ప్లేయర్ నెహాల్ వదేరా(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49) సత్తా చాటాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించగా.. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీసాడు. అశ్విన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 183 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 104 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. జోస్ బట్లర్(25 బంతుల్లో 6 ఫోర్లతో 35), సంజూ శాంసన్(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.