
న్యూఢిల్లీ: తాను టాపార్డర్ బ్యాట్స్‌మన్ అని, అనుకోకుండా ఆల్‌రౌండరనయ్యానని టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇటీవల భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్‌తో కలిసి హార్ధిక్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో 'నువ్వు ఆల్‌రౌండర్‌గా ఎలా మారావు?'అని కపిల్ దేవ్ ప్రశ్నించగా.. హార్ధిక్ ఈ విధంగా స్పందించాడు. కెరీర్ ప్రారంభంలో తనకు కనీసం షూస్ కూడా లేవని, వేరేవాళ్లవి వేసుకొని తొలిసారి బౌలింగ్ చేసానన్నాడు. ఆ తర్వాత అండర్-19 మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు బౌలర్లకు భారం తగ్గించేందుకు అప్పడప్పుడు బౌలింగ్ చేసేవాడినని, అలా ఆల్‌రౌండరనయ్యానన్నాడు.
'మొదట్లో నేను టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ని. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడిని. అయితే, అండర్-19 మ్యాచులు ఆడుతున్నప్పుడు బౌలర్లకు భారం తగ్గించేందుకు అప్పుడప్పుడు బౌలింగ్ చేసేవాడిని. ఒకరోజు కిరణ్ మోరె అకాడమీలో ఆడుతున్పప్పుడు కోచ్ సనత్ కుమార్ సర్ దూరం నుంచి గమనించాడు. మరుసటి రోజు దగ్గరికి వచ్చి బౌలింగ్ చేయమన్నారు. అప్పటికి నాకు షూ కూడా లేవు. వేరేవాళ్లవి వేసుకుని బౌలింగ్ చేశా. మొదటి సారే 5 వికెట్లు పడగొట్టడం వల్ల.. తర్వాతి మ్యాచుల్లో కూడా బౌలింగ్ కొనసాగించమన్నారు. ఆ తర్వాత నెల రోజుల్లోనే రంజీ జట్టుకు ఎంపికయ్యా. అలా అనుకోకుండా అదృష్టవశాత్తు ఆల్ రౌండర్‌గా మారాను" అని హార్ధిక్ వివరించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న హార్ధిక్ పాండ్యా.. ఇప్పటికే జట్టుతో కలిసి దుబాయిలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
గాయానికి ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో దుమ్మురేపిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత నిలకడలేమి ఆటతో విఫలమవుతున్నాడు. రీఎంట్రీలో ఇప్పటి వరకు మెరుగైన ప్రదర్శన కనబర్చలేదు. శ్రీలంక పర్యటనలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. అయినప్పటికీ భారత సెలెక్షన్ కమిటీ హార్దిక్ పాండ్యాపై నమ్మకం ఉంచింది. అయితే హార్దిక్ బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేయడం చాలా కీలకం. హార్థిక్ బౌలింగ్ చేస్తే కోహ్లీకి ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి తప్పుతుంది. అప్పుడు టీమ్ బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది.
ఐపీఎల్ 2021 రెండో దశకు సమయం దగ్గరపడుతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి క్యాష్ రిచ్ లీగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకుని ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా సాధన మొదలెట్టింది. ముంబై స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. దాంతో మిగిలిన మ్యాచ్‌ల్లో రాణించాలనే పట్టుదలతో ఉన్న హార్దిక్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెషన్‌లో హార్దిక్ అచ్చం ఎంఎస్ ధోనీలా హెలికాప్టర్ షాట్ కొట్టాడు. పాదాల వద్ద యార్కర్ రూపంలో పడిన ఓ బంతిని కళ్లుచెదిరే రీతిలో హెలికాప్టర్ షాట్ ఆడాడు.
హార్దిక్ పాండ్యా కొట్టిన హెలికాప్టర్ షాట్‌కు బంతి మైదానం బయపడింది. దీంతో మైదానంలో ఉన్న ముంబై ఇండియన్స్ కోచింగ్ సిబ్బంది షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని ముంబై తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. జస్ట్ వావ్ అని కాప్షన్ పెట్టింది.