రోహిత్ శర్మ ఫామ్‌లోకి వస్తే ఇలాంటి విజయాలే దక్కుతాయని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. అందుకే తాము రోహిత్ ఫామ్ గురించి ఆందోళన చెందలేదన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ(45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో సీఎస్‌కేను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ఫామ్‌లోకి వస్తే ప్రత్యర్థులకు దబిడి దిబిడేనని చెప్పాడు.
నో టెన్షన్..
'మేం ఆడుతున్న విధానం ఇది. ఈ మ్యాచ్ హైస్కోరింగ్ గేమ్ అవుతుందని మాకు తెలుసు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసిన విధానం.. బయట ఉన్న మాకు ఉపశమనం కలిగించింది. రోహిత్ శర్మ ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అతను ఇలా ఆడుతాడని, హిట్ మ్యాన్ ఇలా చెలరేగితే ప్రత్యర్థి టీమ్ తేలిపోతుందని మాకు తెలుసు. అతనికి సూర్యకుమార్ యాదవ్ అండగా నిలిచాడు. వీరి భాగస్వామ్యం మా విజయాన్ని ఖాయం చేసింది.

మా గేమ్ ప్లాన్ ఇదే..
మేం మా బేసిక్స్‌కు కట్టుబడి, సింపుల్ క్రికెట్ ఆడుతున్నాం. మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. సీఎస్‌కే ఈ గేమ్‌లో వెనుకబడి ఉందని, ఉత్కంఠగా మార్చే ప్రయత్నం చేస్తుందని మాకు తెలుసు. మా ఫాస్ట్ బౌలర్లు ధారళంగా పరుగులిచ్చారు. కానీ ఈ వికెట్‌పై 175-180 స్కోర్ చాలా తక్కువ. గత మ్యాచ్‌ల్లోనూ మేం మెరుగైన ప్రదర్శన చేశాం. కానీ మ్యాచ్‌లను ముగించే విషయంలో ఒకటి, రెండు బంతులు మాకు నష్టం చేశాయి. ఈ ఓటముల నుంచి త్వరగానే తేరుకొని విజయాల బాట పట్టాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. వరుసగా మూడు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్.. ప్లే ఆఫ్స్ రేసుకు దూసుకొచ్చింది. చివరి 6 మ్యాచ్‌ల్లో 4 గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం కానుంది.
చెలరేగిన రోహిత్, సూరీడు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా(35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), శివమ్ దూబే(32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/25) రెండు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 177 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సీఎస్‌కే బౌలర్లలో రవీంద్ర జడేజా ఒక్కడే ఒక వికెట్ తీసాడు.