బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు తెలివిగా బౌలింగ్ చేశామని తెలిపాడు.
'మేం చాలా తెలివిగా బౌలింగ్ చేశాం. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బంతులు వేసాం. బేసిక్ ప్లాన్స్‌కు కట్టుబడి బౌలింగ్ చేశాం. ఇలాంటి బంతులు ఆడటం చాలా కష్టం. ప్రత్యర్థి బ్యాటర్లు షాట్స్ ఆడకుండా మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ గెలుపు క్రెడిట్ మా బౌలర్లదే. పిచ్ పచ్చ గడ్డితో అద్భుతంగా ఉంది. దీపక్ చాహర్ వేసిన ఆరంభ ఓవర్లలో బంతి ఆగుతూ వెళ్లడం గమనించాం. వెంటనే స్లోయర్ బాల్స్ వేయాలని నిర్ణయించుకున్నాం.

ఆ తర్వాత మా బౌలింగ్‌లో వేరియేషన్స్ మిక్స్ చేశాం. కచ్చితమైన యార్కర్లను సంధించాం. విల్ జాక్స్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతను మాకు గన్ ఫీల్డర్. గన్ బౌలర్. ఈ రోజు అతను తన సత్తా చాటాడు. 42 బంతుల్లో 42 పరుగులు చేయడం కూడా కష్టమని మేం భావించాం. అందుకే సమయం తీసుకొని ఆడాం. బౌండరీలు కొడితే ఒత్తిడి తగ్గుతుంది. అందుకే చివర్లో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 7 ఫోర్లతో 40), హెన్రీచ్ క్లాసెన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్(2/14) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలోనే 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. విల్ జాక్స్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36), ర్యాన్ రికెల్టన్(23 బంతుల్లో 5 ఫోర్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్(3/26) మూడు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షల్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.