పంజాబ్ కింగ్స్ యువ బ్యాటర్ అషుతోష్ శర్మపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసల జల్లు కురిపించాడు. అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని, ప్రతీ బంతిని చక్కగా హిట్ చేసి తమని భయపెట్టాడని తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. హోరాహోరీ మ్యాచ్‌లో గెలవడం సంతోషంగా ఉందన్నాడు. 'ఇదో అద్భుతమైన మ్యాచ్. అందరూ ఉత్కంఠకు గురయ్యారు. ఈ మ్యాచ్‌కు ముందే చెప్పా. ఈ గేమ్ ప్రతీ ఒక్కరి సత్తాకు పరీక్షగా నిలుస్తుందని, ఐపీఎల్‌లో మ్యాచ్ ఎప్పుడూ ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం.

మ్యాచ్ ముగిసేవరకు అప్రమత్తంగానే ఉండాలి. అషుతోష్ శర్మ బ్యాటింగ్ అసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వచ్చి జట్టును విజయం దిశగా నడిపించడం అద్భుతం. అతను ప్రతీ బంతిని మిడిల్‌లో హిట్ చేశాడు. భవిష్యత్తు నేపథ్యంలో అతని ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చింది. టైమ్ ఔట్‌లో మేం ఒకటే మాట్లాడుకున్నాం. చివరి వరకు అప్రమత్తంగా ఉండాలనుకున్నాం. కొన్ని ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చాం. ఏది ఏమైనప్పటికీ విజయం విజయమే.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. రోహిత్ శర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), తిలక్ వర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అషుతోష్ శర్మ(28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. శశాంక్ సింగ్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(3/21), గెరాల్డ్ కోయిట్జీ(3/32) మూడేసి వికెట్లు తీయగా..ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. 111 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచిన పంజాబ్ ఇన్నింగ్స్‌ను అషుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో లక్ష్యానికి చేరువగా తీసుకొచ్చాడు. కానీ కోయిట్జీ బౌలింగ్‌లో అతను ఔటవ్వడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.