టీమిండియాకు ఎదురు దెబ్బ.. ఇంగ్లండ్ పర్యటనకు స్టార్ ప్లేయర్ దూరం!
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నాడు. వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యా.. 50 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్‌కు కావాల్సిన పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ను సాధించలేకపోయాడని తెలుస్తోంది.
ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ఆడే భారత జట్టును ప్రకటించిన సెలెక్టర్లు.. వన్డే టీమ్ ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. అయితే టీమ్ సెలెక్షన్‌కు హార్దిక్ పాండ్యా అందుబాటులోకి రాలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
వెన్ను నొప్పితో..
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పితో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ముగిసిన వెంటనే బెంగళూరులోని క్రికెట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్న హార్దిక్ పాండ్యా.. ఫిట్‌నెస్ నిరూపించుకునే క్రమంలో మరోసారి గాయపడినట్లు వార్తలు వచ్చాయి.
నెట్స్‌లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేసినప్పటికీ, అతని గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దాంతో అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. వన్డే ఫార్మాట్ ఆడేంత ఫిట్‌నెస్ లేకపోవడంతో హార్దిక్ పాండ్యాకు తగిన విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ మెడికల్ టీమ్ భావిస్తున్నట్లు సీఓఈ వర్గాలు పేర్కొన్నాయి.

హార్దిక్ పాండ్యాకు రెస్ట్..
వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా తరహాలోనే హార్దిక్ పాండ్యాను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. అతనిపై ఉన్న అదనపు ఒత్తిడిని తగ్గించి, పూర్తి ఫిట్‌నెస్‌తో వన్డే ప్రపంచకప్‌కు సిద్దం చేయడమే తమ తదుపరి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
బ్యాకప్‌గా తెలుగు తేజం..
మరోవైపు తరుచూ గాయపడుతున్న హార్దిక్ పాండ్యాకు సరైన బ్యాకప్ సిద్దం చేయడం టీమిండియాకు అనివార్యమైంది. ఈ క్రమంలోనే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని భవిష్యత్తు ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే అన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో నితీష్ రెడ్డి ఉన్నాడని స్పష్టం చేశాడు.
హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు టీమిండియాకు అవసరం. లేదంటే టీమ్ కాంబినేషన్ దెబ్బతింటుంది. ఈ క్రమంలోనే నితీష్ రెడ్డికి వరుసగా అవకాశాలు ఇవ్వనున్నారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications