గయానా: వెస్టిండీస్‌తో రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోందని ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. తప్పని పరిస్థితుల్లో జట్టులో ఒక మార్పు చేయాల్సి వచ్చిందన్న హార్దిక్ పాండ్యా.. కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.
ప్రాక్టీస్ సెషన్‌లో కుల్దీప్ యాదవ్ గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టాస్ సందర్భంగా స్పష్టం చేశాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తాం. గత మ్యాచ్‌లో మేం ఘోర తప్పిదాలు ఏం చేయలేదు. గత మ్యాచ్ ఫలితం గురించి మేం చర్చించుకున్నాం.

తప్పిదాల నుంచి పాఠం నేర్చుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ఈ లక్ష్యాలను 9, 10 ఓవర్లలో చేధించాల్సినవి. చేతిలో వికెట్లు ఉంటే ధాటిగా ఆడవచ్చు. కానీ గత మ్యాచ్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడం మా పతనాన్ని శాసించింది. తప్పని పరిస్థితుల్లో జట్టులో ఓ మార్పు చేయాల్సి వచ్చింది.
ప్రాక్టీస్‌లో కుల్దీప్ యాదవ్ గాయపడ్డాడు. అతని చేతికి బంతి బలంగా తాకింది. గాయం తీవ్రత ఎక్కువగా లేకున్నా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అతనికి విశ్రాంతి ఇచ్చి రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకున్నాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని వెస్టిండీస్ కెప్టెన్ రోవమ్‌న్ పోవెల్ తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందన్న పొవెల్.. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ బ్యాటింగ్‌కు మరింత సహకరిస్తుందన్నాడు. సమష్టిగా రాణిస్తే విజయం సాధించవచ్చని తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు.
భారత బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో యశస్వీ జైస్వాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. తొలి టీ20లో ఓడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. కుల్దీప్ యాదవ్ గాయంపై బీసీసీఐ కూడా ట్వీట్ చేసింది. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ బొటన వేలికి బంతి బలంగా తాకిందని పేర్కొంది.
తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్, రవి బిష్ణోయ్
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్(కీపర్), రోవ్‌మన్ పొవెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మైర్, రొమారియో షెఫెర్డ్, జాసన్ హోల్డర్, అకీల్ హొస్సెన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్