నా అటిట్యూడ్ వల్లే జట్టులో చోటు కోల్పోయా: హార్దిక్ పాండ్యా
కెరీర్ ప్రారంభంలో తన ఆట కంటే అటిట్యూడ్ నచ్చకనే జట్టు నుంచి తప్పించేవారని హార్దిక్ పాండ్యా తెలిపాడు. అప్పుడు తనకు ఈ విషయం తెలిసేది కాదని చెప్పుకొచ్చాడు. గాయంతో భారత జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. టీమిండియా తదుపరి వైట్ బాల్ సిరీస్‌లు ఆడేందుకు సిద్దమవుతున్నాడు.
ఎప్పుడూ కెప్టెన్సీ కోసం ఆడలేదు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎప్పుడూ కెప్టెన్సీ కోసం ఆడలేదని, జట్టు కోసమే ఆడానని తెలిపాడు. 'సారథ్యం విషయానికి వస్తే.. నాకు నేను ఎప్పుడూ సందేహించలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు పదవులు కోసమో లేక నా మాట నెగ్గించుకోవడానికో ఆడను. నేను కెప్టెన్ కాకపోయినా జట్టులో నాయకుడిలాంటి వాడినని భావిస్తాను. జట్టులో నాది ఒక ప్రత్యేకమైన, ప్రభావవంతమైన పాత్ర అని నాకు తెలుసు. నేను చెప్పే మాటలను జట్టులో 11 మంది ఆటగాళ్లు వింటారు.

నాయకుడిగా ఉండటానికి కెప్టెనే కానవసరం లేదనేది నా నమ్మకం. ఒక ఆటగాడిగా కూడా నాయకుడిగా ఉండవచ్చు. నేను చాలా అదృష్టవంతుడిని, కృతజ్ఞుడిని అని భావిస్తున్నా. నేను కెప్టెన్సీ కోసం ఎప్పుడూ ఆడలేదు. ప్రతి క్రికెటర్ కల దేశానికి ప్రాతినిథ్యం వహించడమే. కానీ కెప్టెన్సీ అనేది ఒక అదనపు గౌరవం. అయితే ఆ సంతోషం నాకు కొద్ది నిమిషాలు మాత్రమే నిలిచింది. ఆ తర్వాత జట్టును ఎలా మెరుగుపర్చగలననే ఆలోచించాను. ఆ సమయాన్ని నేను ఆస్వాదించాను. అయితే వాటిని నేను మనసుకు తీసుకోను. ఎందుకంటే అవి ఏ క్షణంలోనైనా మనల్ని విడిచివెళ్లిపోవచ్చు.
నేను ఎవరికీ సమాధనమివ్వను..
ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాకు ముఖ్యం కాదు. ఎందుకంటే అది నాకు అనవసరం. నా పనితో నేను సంతోషంగా ఉన్నానా లేదా? అన్నదే నాకు ముఖ్యం. నేను క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవడానికి ప్రధాన కారణం నా మనసును ఉత్తేజపరుచుకొని, ఆ పాత ఉత్సాహాన్ని తిరిగి పొందడమే. కేవలం ఆటను ఆస్వాదించడానికే ప్రయత్నిస్తాను.
నేను కష్టపడేది కేవలం నా కోసమే. నా సంతోషం, మనశ్శాంతి కోసమే, ఇతరుల కోసం కాదు. అంతా సవ్యంగా సాగినప్పుడు నేను విమర్శకులపై ప్రతీకారం తీర్చుకున్నానని అందరూ అనవచ్చు. కానీ అది నా ఉద్దేశం ఏ మాత్రం కాదు. నాకు నేను సంతృప్తి చెందడమే నా ఏకైక లక్ష్యం. నేను వచ్చిన నేపథ్యం. నా ప్రయాణం ఆధారంగా నేను ప్రత్యేకంగా నిలబడాల్సి వచ్చింది. నా వ్యక్తిత్వం మొదటి నుంచి పూర్తిగా భిన్నంగా ఉండేది. అందుకే నేను ఎదిగే క్రమంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను.
నా అటిట్యూడ్ వల్లే అవకాశాలు కోల్పోయా..
నాకు రంగురంగుల వస్తువులు అంటే ఇష్టం.నేను ఎప్పుడూ చురుకుగా.. హాస్య భరితంగా ఉండేవాడిని. నేను సాధారణ సాంప్రదాయ క్రికెటర్లలా కాకుండా.. కాస్త భిన్నమైన వ్యక్తిని. ఇప్పుడు అది నాకు అనుకూలంగా ఉండొచ్చు. కానీ తొలినాళ్లలో నన్ను చాలా జట్టు నుంచి తొలగించారు. పరుగులు చేయనందవల్ల కాదు.. నా అటిట్యూడ్ నచ్చకనే జట్టు నుంచి తప్పించేవారు. అప్పుడు అటిట్యూడ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. దాని గురించి నాకేమీ అవగాహన కూడా లేదు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

