భారత టెస్ట్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సుదీర్ఘ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా అతను రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆస్ట్రేలియా వేదికగా జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు. అతని రెడ్ బాల్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా ఎర్ర బంతితో బౌలింగ్ మొదలుపెట్టాడు. గంటలకొద్దీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ తన స్టామినాను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. పరిమిత ఓవర్లలో స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన హార్దిక్ పాండ్యా... టెస్ట్‌ల్లో మాత్రం ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి 523 పరుగులతో పాటు 17 వికెట్లు తీసాడు.

6 ఏళ్ల క్రితం చివరి టెస్ట్..
2018 సెప్టెంబర్‌లో చివరిసారిగా హార్దిక్ పాండ్యా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయాల బెడదతో రెడ్ బాల్ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. ఓ దశలో అతను సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ ఫార్మాట్ ఆడేందుకు టీమిండియా సిద్దమవుతోంది.
బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి టెస్ట్ కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టెస్ట్ సిరీస్ అనంతరం టీ20 సిరీస్ జరగనుండగా.. ఇందులో హార్దిక్ పాండ్యా ఆడే అవకాశం ఉంది. టెస్ట్ ఫార్మాట్ ఆడేందుకు కూడా ప్రయత్నించాలని హార్దిక్ పాండ్యాను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.
గంభీర్ మాస్టర్ ప్లాన్..
పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా జట్టులో ఉంటే టీమ్‌కాంబినేషన్ సమతూకంగా ఉండటంతో పాటు అదనపు బ్యాటర్ లేదా బౌలర్‌ను తీసుకునే వెసులుబాటు మేనేజ్‌మెంట్‌కు కలుగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయానికి హార్దిక్ పాండ్యాను సిద్దం చేయాలనే పట్టుదలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నట్లు సమాచారం.
హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడటం ముఖ్యమని భారత ఆటగాళ్లను బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. మరి ఈ రూల్ హార్దిక్ పాండ్యాకు వర్తిస్తుందా? లేదా? అనేది చూడాలి. ఒకవేళ అతను దేశవాళీ క్రికెట్ ఆడాలనుకుంటే మాత్రం బరోడా తరఫున బరిలోకి దిగాల్సి ఉంటుంది. పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే హార్దిక్ పాండ్యాను నేరుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయవచ్చు.