
ముంబై: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే బయటకు అడుగుపెట్టకుండా ఇంట్లో ఉండటం ఇబ్బందిగా ఫీలవుతున్న చాలా మంది లాక్‌నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల చేతుల తన్నులు తింటున్నారు. అయితే ఇంట్లో ఉంటూ కూడా ఎలా ఎంజాయ్ చేయవచ్చో ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు తమ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పించారు.
చతేశ్వర్ పుజారా గార్డెన్‌లో మొక్కలు పెంచడంలో బిజీగా కనిపిస్తుండగా.. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ మెరుగుపర్చుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం కోహ్లీకి ఇంట్లోనే అతని భార్య అనుష్క శర్మ హెయిర్‌కట్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పాండ్యా బ్రదర్స్ ఇంట్లోనే క్రికెట్ ఆడుతూ.. ఈ క్వారంటైన్ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రియురాలు నటాషా స్టాంకోవిచ్, సోదరుడు కృనాల్ పాండ్యా, వదినతో క్వారంటైన్‌ను తెగ ఎంజయ్ చేస్తున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నాడు. తాజాగా ఇంట్లో క్రికెట్ ఆడిన వీడియోను కృనాల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో.. 'దయచేసి ఇంట్లోనే ఉండండి. ఇంట్లో ఉంటూ కూడా ఎంజాయ్ చేయవచ్చు. మా ఫ్యామిలీలాగా.. లాక్‌డౌన్ అప్‌డేట్స్ చూస్తూ.. ఇంట్లోనే ఉంటూ కరోనా కట్టడికి మీ వంతు తోడ్పడండి'అని పాండ్యా బ్రదర్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
టెన్నిస్ బాల్‌తో ఈ బ్రదర్స్ క్రికెట్ ఆడగా.. హార్దిక్ పాండ్య బౌలింగ్ చేసి కృనాల్ వికెట్‌ని కూడా పడగొట్టాడు. అనంతరం శానిటైజర్‌ను కూడా వాడాడు. గత ఏడాది వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్న హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత మళ్లీ టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడింది లేదు. మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌కి హార్దిక్ ఎంపికయ్యాడు. కానీ.. సిరీస్ అర్ధాంతరంగా రద్దవడంతో అతనికి నిరాశే ఎదురైంది.
ముంబైలో ఇటీవల జరిగిన డీవై పాటిల్ టీ20 కప్‌లో బ్యాక్ టు బ్యాక్ శతకాలు బాదిన హార్దిక్ పాండ్య.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఎలా రాణిస్తాడో..? అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే.. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏప్రిల్ 15కి వాయిదా పడగా.. ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం.. ఐపీఎల్ 2020 సీజన్‌ని రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.