పల్లెకెలె: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంపైర్‌ను హగ్ చేసుకొని నవ్వులు పూయించాడు. వర్షం దాగుడు మూతలు ఆడుతుందని చెబుతూ పడి పడి నవ్వాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
భారత్-నేపాల్ మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. చివరకు అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఓవర్లతో పాటు లక్ష్యాన్ని కుదించి ఫలితాన్ని తేల్చారు. అయితే వర్షం దోబుచులాడుతూ మైదాన సిబ్బందితో పాటు అంపైర్లను ఓ ఆట ఆడుకుంది. నేపాల్ బ్యాటింగ్ సందర్భంగా మూడు సార్లు అంతరాయం కలిగించిన వర్షం.. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా ఒక సారి అంతరాయం కలిగించింది.

వర్షం పడిన ప్రతీసారి గ్రౌండ్స్‌మెన్ చెమటలు చిందించారు. నిర్ణీత సమయంలో ఆటకు మైదానాన్ని సిద్దం చేశారు. అయితే నేపాల్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం అంపైర్లను ఫూల్ చేసింది. 34 ఓవర్ చివర్లో వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు. మైదాన సిబ్బంది కవర్లతో లోపలికి రాగా.. అంపైర్లు స్టంప్స్‌ను తొలగించారు. వెంటనే వర్షం ఆగిపోయింది.
దాంతో మళ్లీ ఆటకు సిద్దమవ్వగా.. మైదాన సిబ్బంది కవర్లను తీసుకొని వెనక్కివెళ్లారు. అంతలోనే వర్షం మళ్లీ వచ్చింది. ఈ హైడ్ అండ్ సీక్ వర్షాన్ని చూసి హార్దిక్ పాండ్యా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఈ క్రమంలో పక్కన ఉన్న అంపైర్‌పై జోకులు పేల్చుతూ హగ్ చేసుకున్నాడు. అంపైర్ కూడా హార్దిక్ నవ్వులకు ఫిదా అయ్యి.. చిరనవ్వులు చిందించాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. హార్దిక్-అంపైర్ మధ్య జరిగిన సంభాషణపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'అంపైర్ మామ.. వర్షం మనతో దాగుడు మూతలు ఆడుతోందిరా..!'అని హార్దిక్ అన్నాడని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్(97 బంతుల్లో 8 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సోంపల్ కమీ(56 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 48) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ కుశాల్ భుర్టెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/61), రవీంద్ర జడేజా(3/40) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్.. నేపాల్‌కు కలిసొచ్చింది.
అనంతరం వర్షం కారణంగా టీమిండియా లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్ణయించారు. ఇక భారత్ 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 147 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 నాటౌట్), శుభ్‌మన్ గిల్(62 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 67 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు.