బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే ఐపీఎల్ 2026 సీజన్‌లో శుభారంభం చేశామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. రోహిత్, రికెల్టన్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చారని కొనియాడిన హార్దిక్ పాండ్యా.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ ప్రదర్శనపై కూడా ప్రశంసల జల్లు కురిపించాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా వాంఖడే మైదానం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్లతో తేడాతో కేకేఆర్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో వరుసగా 13 సీజన్ల తర్వాత ఐపీఎల్‌లో శుభారంభం చేసింది. ఈ విజయానంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా... కేకేఆర్‌ను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసిన బౌలర్లదే ఈ గెలుపు క్రెడిట్ అన్నాడు.

'14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్‌లో విజయం. నిజంగా ఇది చాలా సుదీర్ఘ నిరీక్షణ. ప్రతిసారి మేం సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని అనుకునేవాళ్లం. ఈసారి అది సాధించినందుకు జట్టు మొత్తం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత క్రికెట్‌లో 220 ప్లస్ లక్ష్క్ష్యాన్ని చేధించడం కష్టమేం కాదు. పైగా ఈ వికెట్ ఎలా స్పందిస్తుందో మాకు తెలుసు. మా బౌలర్లను అభినందించాలి. వారు కేకేఆర్‌ను 240- 250 పరుగుల చేయకుండా అడ్డుకున్నారు. కేకేఆర్ మరో 20-30 పరుగులు అదనంగా చేసి ఉంటే మాకు కష్టమయ్యేది. ఈ మైదానంలో 220 ఎప్పుడూ ఛేజ్ చేయగలిగే లక్ష్యమే.

రోహిత్, రికెల్టన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. గతేడాది కూడా ర్యాన్ రికెల్టన్ రాణించాడు. దాంతోనే క్వింటన్ డికాక్‌కు బదులు రికెల్టన్‌ను ఆడించాం. ప్లేయర్‌కు అండగా ఉన్నామని, జట్టులో వరుసగా అవకాశాలు ఇవ్వాలనే విషయాన్ని డికాక్ అర్థం చేసుకున్నాడు. మా ఈ నిర్ణయం వర్కవుట్ అయినందుకు సంతోషంగా ఉంది. రోహిత్ ఆడే కొన్ని షాట్లు చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే. అతని ఆట అత్యుత్తమం.. అమోఘం.
శార్దూల్ ఠాకూర్ కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. జట్టులోకి రాగానే అతనికి నేను చెప్పింది ఒక్కటే.. 'ఇక ఫ్రాంచైజీలు మారడం చాలు. నీ కెరీర్ ముగిసే వరకు ముంబై ఇండియన్స్‌తోనే ఉండాలన్నాను. అతను బ్యాటర్లను బోల్తా కొట్టించే విధానం, బౌలింగ్ చేసే తీరు అద్భుతం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67),అంగ్‌క్రిష్ రఘువంశీ(29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 ) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలరల్లో శార్దూల్ ఠాకూర్(3/35) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78), ర్యాన్ రికెల్టన్(43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 81) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.
