మంచు కాదు.. ఈ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి:హార్దిక్ పాండ్యా
ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయకపోవడం, వచ్చిన (క్యాచ్‌లు) అవకాశాలను అందిపుచ్చుకోకపోవడం తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఓడినా.. తమ కుర్రాళ్లంతా బాగా ప్రయత్నించారని, తమ సర్వస్వాన్ని ఒడ్డారని, కానీ తమకు ఈ రోజు కలిసి రాలేదని చెప్పాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. మంచు ఉన్నా అంతగా ప్రభావం చూపలేదన్నాడు. బ్యాటింగ్‌లో రాణించినా.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీసాయని చెప్పాడు.
మంచు ప్రభావం లేదు..
'మంచు పెద్దగా ప్రభావం చూపలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కొన్ని అద్భుతమైన షాట్స్ ఆడారు. మేం కూడా కొన్ని చెడ్డ బంతులు వేశాం. అందుకే వారికి మంచి ఆరంభం లభించింది. ఆ తర్వాత మేం తిరిగి పుంజుకున్నాం. కానీ అది సరిపోలేదు. మా బ్యాటింగ్ చాలా మెరుగైంది. ఈ రోజు నేను చాలా ఎంజాయ్ చేశాను. 244 పరుగులు మంచి స్కోర్. మా బౌలర్లు డిఫెండ్ చేస్తారని నమ్మాను. కానీ ఈ రోజు మా బౌలింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. చివరి మూడు బంతులు మినహా నా బౌలింగ్‌ను కూడా నేను ఆస్వాదించాను.

మా ఫీల్డింగ్‌లో అవకాశాలు చేజారాయి. ఈ సీజన్‌లో మేం చాలా క్యాచ్‌లు వదిలేస్తున్నాం. క్యాచ్‌లను పట్టుకున్నప్పుడే అదృష్టం, మూమెంటమ్ మారుతుంది. క్యాచ్‌లు వదిలేస్తే జట్టుకు నష్టం జరుగుతుంది. కానీ ఫర్వాలేదు. కుర్రాళ్లంతా బాగా ప్రయత్నించారు. తమ సర్వస్వాన్ని ఒడ్డారు. కానీ ఈ రోజు మాకు కలిసి రాలేదు.
ప్రేక్షకులను చూస్తే బాధగా ఉంది..
మా బౌలింగ్ సమస్యలను పరిష్కరించేందుకు మాకు ఆప్షన్స్ కూడా ఎక్కువగా లేవు. ఎలాంటి మార్పులు చేయగలమో పరిశీలిస్తాం. అయితే నా బౌలర్లను నేను తప్పుబట్టను. ఒక జట్టుగా ముంబై ఇండియన్స్‌కు ఏదైతే గుర్తింపు పొందిందో.. దానికి తగ్గట్టుగా మేం రాణించలేకపోయాం. మేం ఫోకస్ చేయాల్సి విషయాలను సరిచూసుకోవాలి. అయినా పర్వాలేదు. మాకు అంకితభావం కలిగిన ఓనర్స్, గొప్ప సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు. మేం కచ్చితంగా పరిష్కారం కనుగొంటాం.
ప్రేక్షకుల నుంచి మాకు అద్భుతమైన మద్దతు లభిస్తోంది. కానీ మాకు మద్దతు ఇచ్చేంత గొప్ప ప్రదర్శనను మేం వారికి అందించలేకపోయాం. అయినప్పటికీ వారు మా ప్రేము చూపుతున్నారు. కొన్నిసార్లు ప్రత్యర్థి జట్టు వచ్చి ఆడుతున్నప్పుడు.. ప్రేక్షకులు వారి పేర్లను నినదిస్తుంటే బాధగా అనిపిస్తుంది. వారి ప్రేమను నమ్మకాన్ని తిరిగి పొందడానికి మేం వారిని మరింతగా అలరించాల్సిన అవసరం ఉంది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
పాపం రికెల్టన్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్(55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 123 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. విల్ జాక్స్(22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే(2/54) రెండు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసారు.
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76), హెన్రీచ్ క్లాసెన్(30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అల్లా ఘజన్‌ఫర్(2/51) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

