
ముంబై: దేశవ్యాప్తంగా హోలీ పండుగను ప్రజలు చాలా సాధారణంగా జరుపుకుంటున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో హోలీ పండుగ జరుపుకోకపోవడమే ఉత్తమమని వైద్యుల సూచించడంతో చాలా మంది ఈ వేడుకులకు దూరంగా ఉన్నారు. ఈసారి హోలీ జరుపుకోవడం లేదని ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రకటించారు. కొద్దిమంది మాత్రమే హోలీ జరుపుకోగా.. వారు కూడా ఆర్బాటాలకు పోకుండా సహజ సిద్ధమైన రంగులనే ఉపయోగించారు. పసుపు, కుంకుమ, ఇతర రంగులనే చల్లుకుంటున్నారు.
ఇక టీమిండియా క్రికెటర్లు సైతం రంగుల పండుగను చాలా సాధారణంగా జరుపుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో ఈ పండుగను ఆస్వాదించిన స్టార్ క్రికెటర్లు వారితో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పాండ్యా బ్రదర్స్ తమ సతీమణులు పంఖురి, నటాషా స్టాన్‌కోవిచ్‌లతో కలిసి హోలీ వేడుక చేసుకున్నారు. శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, విరాట్ కోహ్లీ కూడా అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
గాయాంతో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌కు ఎంపికైన జట్టులో చోటు దక్కించుకున్న ఈ స్టార్ ప్లేయర్స్.. గురువారం జరిగే తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయనున్నారు. ఇక దేశవాళీ క్రికెట్‌లో విధ్వంస సృష్టించిన పాండ్యా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వీరితో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.