
ముంబై: టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా బర్త్‌డే సందర్భంగా అతని సోదరుడు, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మంగళవారం కృనాల్ 29వ బర్త్‌డే జరుపుకున్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ తన అన్నకు అరుదైన బహుమతిని అందజేశాడు. తానిచ్చిన గిఫ్ట్ విషయాన్ని ఫ్యాన్స్‌తో కూడా పంచుకున్నాడు.
కృనాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అతను చేసిన హంగామ అందరినీ ఆకట్టుకుంటోంది. 'హ్యాపీ బర్త్‌డే భాయ్. గృహ నిర్బంధంలో మనమిద్దరం కలిసున్నాం. ఇదిగో నీకోసం జీరో క్యాలరీ ఇన్విజిబుల్ (కనిపించని) కేక్ గిఫ్ట్‌గా ఇస్తున్నా' అంటూ ఒక ఫొటో పోస్టు చేశాడు.
అందులో హార్దిక్ తన సోదరుడికి కేక్ తినిపిస్తున్నట్లు కనిపించేలా ఉన్నా.. అతడి చేతిలో నిజంగా కేక్ లేదు. అందుకే దాన్ని ఇన్విజిబుల్ కేక్ అని ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్ పేర్కొన్నాడు. అయితే దీనికి అభిమానులు ఫన్నీకామెంట్స్ చేస్తున్నారు. కోడిని వేలాడదీస్తూ కోడిని తిన్నట్లుందని ఒకరంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే ఏం చేస్తాంలే అని ఇంకొకరు కామెంట్ చేశారు.
ఇక కరోనా దెబ్బతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. 21 రోజులు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే పాండ్యా సోదరులు సైతం స్వియ నిర్భందంలో ఉన్నారు. ఇక వెన్ను గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్.. రీ ఎంట్రీ కోసం తహతహలాడుతున్నాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు జట్టులో చోటు దక్కించుకున్నా.. వర్షం.. కరోనా గత్తరతో ఈ సిరీస్ ఒక్క బంతి పడకుండానే రద్దయింది. ఇక ఐపీఎల్‌తోనైనా పునరాగమనం చేద్దామనుకుంటే అది రద్దయ్యే అవకాశం ఉంది.