టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వైజాగ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బుల్లెట్ త్రోతో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌ను రనౌట్ చేశాడు.
హార్దిక్ డైరెక్ట్ హిట్ చేయడంతో మిచెల్ సాంట్నర్ బిత్తరపోయాడు. డైవ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్‌కు ఫిదా అయిన నెటిజన్లు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. హార్దిక్ త్రో కాదు.. అది ఒక మిస్సైల్, మెరుపు త్రో.. మాస్ రనౌట్ అని కామెంట్ చేస్తున్నారు.
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 17వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని సాంట్నర్ థర్డ్ మ్యాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌కు ప్రయత్నం చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా బంతిని అందుకొని వేగంగా నాన్‌స్ట్రైకర్ వికెట్లను డైరెక్ట్ హిట్ చేశాడు. సాంట్నర్ డైవ్ చేసినా లాభం లేకపోయింది. దాంతో మిచెల్ సాంట్నర్(11) నిరాశగా పెవిలియన్ చేరగా.. భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి టీమ్ సీఫెర్ట్ ఇచ్చిన కష్టతరమైన షార్ట్ థర్డ్‌లో బుమ్రా నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో టీమ్ సీఫెర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 25 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ సాధించడంతో పవర్ ప్లేలో న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది.
హాఫ్ సెంచరీకి చేరువైన కాన్వేను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి తొలి వికెట్‌కు నమోదైన 100 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. రచిన్ రవీంద్ర(2)ను బుమ్రా, టీమ్ సీఫెర్ట్(62)ను అర్ష్‌దీప్ సింగ్, గ్లేన్ ఫిలిప్స్(24)ను కుల్దీప్ యాదవ్, మార్క్ చాప్‌మన్(9)ను రవి బిష్ణోయ్, మిచెల్ సాంట్నర్ హార్దిక్ రనౌట్ చేయడంతో న్యూజిలాండ్ పరుగుల వేగం తగ్కింది. జాక్ ఫోక్స్(13), మ్యాట్ హెన్రీ(6 నాటౌట్) సాయంతో డారిల్ మిచెల్(39 నాటౌట్) జట్టుకు 214 పరుగుల భారీ స్కోర్ అందించాడు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా చెరో వికెట్ తీసారు. హర్షిత్ రాణా ఒక్క వికెట్ తీయకపోగా 54 పరుగులు సమర్పించుకున్నాడు.