తొలి భారత బౌలర్‌గా హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత..!

సౌథాంప్టన్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా(51, 4/33) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. తద్వారా టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో పాటు నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.
గతంలో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా ఇలాంటి ఫీట్‌కు చేరువగా వచ్చి మిస్ చేసుకొన్నాడు. శ్రీలంకతో 2009లో టీ20 సిరీస్ సందర్భంగా యువీ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే మూడు వికెట్లను మాత్రమే తీశాడు. ఇప్పటికే ఇదే అత్యుత్తమంగా ఉండగా.. హార్దిక్ అధిగమించాడు.

హార్దిక్ కంటే ముందు ఎవరు..?
ఐసీసీ గుర్తింపు వచ్చిన దేశాల నుంచి ఒకే టీ20 మ్యాచ్‌లో అర్ధశతకంతోపాటు నాలుగు వికెట్లు తీసింది ఇప్పటి వరకు పాండ్యాతో కలుపుకొని నలుగురు మాత్రమే. తొలుత విండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రావో (2009) భారత్‌పైనే (66* పరుగులు, 4/38) సాధించడం గమనార్హం. జింబాబ్వే మీద 2011లో పాక్ మాజీ ప్లేయర్ మహమ్మద్ హఫీజ్ (71 పరుగులు, 4/10), 2011లో ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ (59 పరుగులు, 4/15) ఇంగ్లండ్‌పై సాధించారు. అఫ్గానిస్థాన్ ఆటగాడు సమిముల్లా షిన్వారి (61 పరుగులు, 4/14) కెనడా మీద 2012లో సాధించినా పరిగణనలోకి రాదు. ఎందుకంటే అప్పటికి అఫ్గానిస్థాన్‌కు ఐసీసీ గుర్తింపు దక్కలేదు.

కపిల్ దేవ్‌ను తలపిస్తూ..
భారత జట్టులో పేస్ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్ చేయగలిగే ఆటగాళ్లు చాలా తక్కువ. టీమిండియాకు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించిన మాజీ సారథి కపిల్‌దేవ్ జట్టులో ఆల్‌రౌండర్ పాత్రనే పోషించాడు. అటు తర్వాత చాన్నాళ్లకు హార్దిక్ పాండ్యా రూపంలో మరొకరు దొరికారని అభిమానులు సంబరపడిపోయారు. అభిమానుల ఆకాంక్షకు తగ్గట్టుగానే ఆరంభంలో టీమిండియా తరఫున, ఐపీఎల్‌లో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. అయితే రెండేళ్ల కిందట ఎప్పుడైతే వెన్నముకకు గాయమైందో.. అప్పటి నుంచి క్రమంగా పాండ్యా ఫామ్‌తోపాటు కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. జట్టుకు భారంగా మారాడని విమర్శలు వచ్చాయి. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని పక్కనపెట్టేసారు.

నేలకు కొట్టిన బంతిలా..
నేలకు కొట్టిన బంతిలా హార్దిక్ పాండ్యా పుంజుకున్నాడు. వేగంగా ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్ 2022 సీజన్ ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇటు బ్యాటింగ్‌తోపాటు తనలోని నాయకుడి లక్షణాలను వెలుగులోకి తీసుకొచ్చి గుజరాత్‌ను టైటిల్ విన్నర్‌గా నిలిపాడు. బౌలింగ్‌లో ఎక్కువగా ఓవర్లు వేయకపోయినా.. అవసరమైనప్పుడు మాత్రం బంతిని అందుకొని వికెట్లు పడగొట్టి తనేంటో నిరూపించుకున్నాడు. ఐర్లాండ్‌పై కెప్టెన్‌గానూ, ఆటగాడిగా రాణించాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో రోహిత్ నాయకత్వంలోని టీమిండియా మూడు టీ20ల సిరీస్‌లోనూ కీలకమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications