ఆసియాకప్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో శుక్రవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఫీల్డింగ్ సమయంలో అతను మైదానంలోకి రాలేదు. తొడ కండరాలు పట్టేయడంతోనే అభిషేక్ శర్మ ఫీల్డింగ్ చేయనట్లు తెలుస్తోంది.
అభిషేక్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మకు కూడా కండరాలు పట్టేయడంతో మైదానం వీడారు. తొలి ఓవర్ వేసి వికెట్ తీసిన హార్దిక్ పాండ్యా కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు. ఆ తర్వాత అతను మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. మ్యాచ్ చివర్లో బౌండరీ లైన్‌పై క్యాచ్ పట్టేందుకు ఎగిరిన తిలక్ వర్మకు కూడా కండరాలు పట్టేసాయి. దాంతో అతను కూడా మైదానం వీడాడు.

అయితే ఈ ముగ్గురి గాయాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉక్కపోత వాతావరణం కారణంగా కండరాలు పట్టేసాయని మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. శనివారం రికవరీడేగా వాడుకొని ఫైనల్‌కు సిద్దమవుతామని స్పష్టం చేశాడు. మీడియా సమావేశంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఇదే విషయాలన్ని వెల్లడించాడు. అయితే శనివారం వారి ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకు వస్తామని చెప్పాడు.
'దుబాయ్‌లోని వాతావరణం వల్ల హార్దిక్ పాండ్యా అసౌకర్యానికి గురయ్యాడు. కండరాలు పట్టేయడంతో మళ్లీ బౌలింగ్ చేయలేదు. ఇప్పటికైతే పెద్ద గాయం కాదని మేం భావిస్తున్నాం. ఇవాళ అతని ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకు వస్తాం. అభిషేక్ శర్మ కూడా క్రాంప్స్‌తో ఇబ్బంది పడ్డాడు. వారిద్దరికీ పెద్దగా గాయాల సమస్యేమీ లేదు. కేవలం కండరాలు పట్టేయడంతోనే ఇబ్బంది పడ్డారు. ఫైనల్‌కు తప్పకుండా అందుబాటులో ఉంటారని భావిస్తున్నా. తుది పోరుకు కేవలం ఒక్క రోజు మాత్రమే వ్యవధి ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ సెషన్ ఏమీ ఉండదు. ప్లేయర్స్‌కు మసాజ్ సెషన్స్ ఉంటాయి. వారంతా రిలాక్స్ కావాల్సిన అవసరం ఉంది. మా కంటే పాకిస్థాన్‌కు ఒక రోజు అదనంగా విశ్రాంతి లభించింది. కాబట్టి, భారత ఆటగాళ్లు ఎక్కువ సాధన చేస్తే మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.'అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.
ఒకవేళ అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫైనల్‌కు దూరమైతే టీమిండియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ టోర్నీలో అభిషేక్ శర్మ ఒక్కడే విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. మ్యాచ్‌లను ఏకపక్షం చేశాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించే హార్దిక్ పాండ్యా కూడా జట్టుకు కీలకం. అయితే ఈ ఇద్దర్నీ భర్తీ చేసే ఆటగాళ్లు కూడా జట్టులో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అభిషేక్ శర్మ దూరమైతే.. సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. రింకూ సింగ్ లేదా జితేష్ శర్మ తుది జట్టులోకి వస్తారు. హార్దిక్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగుతాడు. అప్పుడు టీమిండియాకు ఒక బ్యాటింగ్ ఆప్షన్ తక్కువ అవుతుంది.