Thomas Rew: టీమిండియా సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో తమ ఓటమిని శాసించాడని ఇంగ్లండ్ అండర్ 19 కెప్టెన్ థామస్ రూ తెలిపాడు. అతని ఊచకోత బ్యాటింగ్ చూసి ఏం చేయాలో పాలుపోక తల పట్టుకున్నామని తెలిపాడు. ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం జరిగిన ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ (80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175) విధ్వంసకర శతకంతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 100 పరుగులతో ఇంగ్లండ్ చిత్తు చేసి ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ రూ.. వైభవ్‌ను త్వరగా ఔట్ చేయకపోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా తమ బ్యాటింగ్‌ను ఆస్వాదించామని చెప్పాడు. 'వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాడు ఒక్కసారి ఊపు అందుకుంటే అడ్డుకోవడం చాలా కష్టం. అతని దూకుడైన బ్యాటింగ్ చూసి మేం ఏం చేయాలో పాలుపోక తల పట్టుకున్నాం. మేం తన గురించి మంచి హోమ్ వర్క్ చేశాం. బంతుల్లో వైవిధ్యం చూపించాలనుకున్నాం. గతంలో భారత్‌పై మాకు ఆ ప్రణాళిక పని చేసింది. కానీ ఈ రోజు వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు.
మా బ్యాటర్ల నుంచి కూడా గొప్పగా పోరాడారు. కాలేబ్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. డాకిన్స్ కూడా విలువైన పరుగులు జోడించాడు. భారీ లక్ష్య ఛేదనలో ఫలితం గురించి ఆలోచించకుండా ఆటను ఆస్వాదించాలని అనుకున్నాం. మేం విజయానికి చాలా దూరంగా నిలిచినా.. మైదానంలో మంచి సమయాన్ని గడిపాం. ఆటను బాగా ఆస్వాదించాం.'అని థామస్ రూ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత అండర్ 19 టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ(80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. కెప్టెన్ ఆయుష్ మాత్రే(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీ సాధించాడు. అభిజ్ఞాన్ కుండు(40), విహాన్ మల్హోత్రా(30), వేదాంత్ త్రివేది(32), కాన్షిక్(37 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. జేమ్స్ మింటో(3/63) మూడు వికెట్లు పడగొట్టాడు. మన్నీ లమ్స్‌డెన్ ఒక వికెట్ తీసాడు.
అనంతరం ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కాలెబ్ ఫాల్కోనర్(67 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 115) సెంచరీతో రాణించినా.. బెన్ డాకిన్స్(56 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అంబ్రిష్(3/56) మూడు వికెట్లు తీయగా.. దీపేష్ దేవండ్రన్(2/64), కాన్షిక్ చౌహన్(2/63) రెండేసి వికెట్లు తీయగా.. ఖిలాన్ పటేల్, ఆయుష్ మాత్రే తలో వికెట్ తీసారు.