వృద్దిమాన్ సాహా.. నీ వెంటే ఉంటాం.. ఆ జర్నలిస్ట్ పేరు చెప్పు: మాజీ క్రికెటర్లు

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాకు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అండగా నిలిచారు. ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్ట్ తీవ్ర ఒత్తిడి తెచ్చాడని ఆరోపిస్తూ సాహా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను సైతం అతను షేర్ చేశాడు. ఇంటర్వ్యూకు అంగీకరించకపోవడంతో సదరు జర్నలిస్ట్ బెదరింపులకు దిగాడని సాహా పేర్కొన్నాడు.
'భారత క్రికెట్ జట్టుకు నేను చేసిన సేవలకు గాను ఒక జర్నలిస్ట్ నుంచి ఎదురైన అనుభవం ఇది. జర్నలిజం ఇంత దిగజారిపోయింది'అనే క్యాప్షన్‌తో సాహా ఆవేదన వ్యక్తం చేశాడు.అయితే సాహా ట్వీట్ స్పందించిన అభిమానులు, మాజీ క్రికెటర్లు అతనికి మద్దతు తెలిపారు. సదరు జర్నలిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు దిగ్గజ బౌలర్లు హర్భజన్ సింగ్, ఆర్‌పీ సింగ్ సాహా వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా స్పందించారు.
ఆ జర్నలిస్ట్ పేరు చెప్పు..
'ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరం. కేవలం చెంచాగిరి చేసేవాడే ఇలా మర్యాద లేకుండా ప్రవర్తిస్తాడు. అసలు అతను పాత్రికేయుడే కాదు. నీతో ఉంటా సాహా'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. బెదిరింపులకు దిగిన సదరు జర్నలిస్ట్ పేరు బయటపెట్టాలని సాహాను హర్భజన్ సింగ్ కోరాడు. 'బెదిరింపులకు దిగిన సదరు జర్నలిస్ట్ పేరును బయటపెట్టు వృద్ది. అతని గురించి క్రికెట్ కమ్యునిటీ తెలుసుకుంటుంది. లేకుంటే మంచి జర్నలిస్టులను కూడా అనుమానించాల్సి వస్తుంది. అయినా ఇదేం జర్నలిజం. బీసీసీఐ, జైషా, సౌరవ్ గంగూలీ ఆటగాళ్లకు అండగా ఉండాలి'అని హర్భజన్ సింగ్ కోరాడు.
ఒక్క సోర్స్ లేదా?
ఇక సాహాను బెదిరించిన జర్నలిస్ట్ ఎవరో చెప్పాలంటూ మీడియాను ఆర్‌పీ సింగ్ కోరాడు. 'క్రికెటర్లు, బీసీసీఐ గురించి తరుచూ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తుంటాయి. అనేక సోర్స్‌లు ఈ విషయాలను తెలియజేస్తుంటాయి. అయితే సాహాను బెదిరించిన సదరు జర్నలిస్ట్ ఎవరు? అనే ఒక్క సోర్స్ లేదా?'అని ఆర్‌పీ సింగ్ ప్రశ్నించాడు. ప్రముఖ జర్నలిస్ట్ బొరియా మజూందారే సాహాను బెదిరించాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. అతనొక్కడే you స్పెల్‌ను ypuగా రాస్తాడని కామెంట్ చేస్తున్నారు.
ముఖం మీదే చెప్పారు..
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు సాహాను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో వృద్దిమాన్ సాహా మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రిటైర్‌మెంట్ గురించి ఆలోచించాలని సూచించాడని తెలిపాడు. కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో గాయంతో కీలక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ జట్టులో చోటు గురించి భరోసా ఇచ్చాడని, కానీ ఇంతలోనే పరిణామాలన్నీ మారిపోయాయన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications