
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన కీలక పోరులో న్యూజిలాండ్ బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేశారని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ప్లాన్ ప్రకారం సింగిల్స్ ఇవ్వకుండా విరాట్ కోహ్లీ ఇగోను టచ్ చేసి మరి అతని వికెట్ సాధించారని చెప్పుకొచ్చాడు. ఇక తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన కోహ్లీసేన సెమీస్ అవకాశాలను గల్లంతు చేసుకుంది. ఇక ఈ ఓటమిపై స్పందించిన హర్భజన్ సింగ్.. న్యూజిలాండ్ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడిన భజ్జీ.. ఈ మ్యాచ్ ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీకి సింగిల్స్ ఇవ్వకుండా కట్టడి చేశారని, అతని ఇగోతో ఆడుకున్నారని తెలిపాడు. దాంతో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన విరాట్ మూల్యం చెల్లించుకున్నాడని చెప్పాడు. 'న్యూజిలాండ్ బౌలర్ల విరాట్ కోహ్లీ ఇగోతో ఆడుకున్నారు. అతనికి ఎట్టి పరిస్థితుల్లో రన్స్ ఇవ్వద్దనుకున్నారు. ఏ ఆటగాడైనా వస్తూ వస్తూనే భారీ షాట్లు ఆడితే ఒకే. కానీ కనీసం సింగిల్స్ ఇవ్వకుండా కట్టడి చేస్తే మాత్రం విరాట్ కోహ్లీ లాంటి పెద్ద ప్లేయర్లు హర్ట్ అవుతారు. అతనిలానే పేలవ షాట్ ఆడి మూల్యం చెల్లించుకుంటారు'అని భజ్జీ తెలిపాడు.
ఇక కోహ్లీ సహజంగా ఆ షాట్ ఆడలేదని, అతను ఆడేలా న్యూజిలాండ్ బౌలర్లు ఇష్ సోదీ, మిచెల్ సాంట్నర్ పురొగొల్పారని భజ్జీ చెప్పుకొచ్చాడు. సింగిల్ ఇవ్వకుండా అతనిపై ఒత్తిడి పెంచడంతో విరాట్ ఆ షాట్ ఆడాల్సి వచ్చిందన్నాడు. న్యూజిలాండ్ బౌలర్ల ట్రాప్‌లో కోహ్లీ చిక్కిపోయాడన్నాడు. 'ఆ షాట్ విరాట్ కోహ్లీ సహజంగా ఆడింది కాదు. అసలు అతను ఆ షాట్ ఆడాల్సిందే కాదు. అదే బంతిని ఓవర్ కవర్ మీదుగా ఆడినా లేదా స్టెప్ ఔట్ అయి ఆడినా డిస్టెన్స్ క్లియర్ అయ్యేదనేది నా అభిప్రాయం'అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. జడేజా (19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ 26 నాటౌట్)నే భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్. తర్వాత న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్ డారిల్ మిచెల్ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగగా.. విలియమ్సన్ (31 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు) అజేయంగా నిలబడి మ్యాచ్ ముగించాడు.
ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. హ్యాట్రిక్ విక్టరీలతో గ్రూప్2 టాపర్ పాకిస్థాన్ సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకోగా.. పాయింట్ల ఖాతానే తెరవని భారత్(-1.61 రన్‌రేట్) ఐదో ప్లేస్‌లో ఉంది. మిగిలిన మ్యాచ్‌ల్లో చిన్న జట్టు అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై గెలిచినా మనోళ్లు సెమీస్ చేరడం కష్టమే. ఎందుకంటే ఈ మూడు టీమ్స్‌తోనే తలపడనున్న న్యూజిలాండ్ రెండింటిలో ఓడాలి, అది అసాధ్యమే అనొచ్చు. ఒక మ్యాచ్‌లో ఓడినా ప్లస్ రన్‌రేట్(0.76)తో కివీస్ ముందంజ వేసే చాన్సుంది. కాబట్టి భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే.