టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ దాదా ప్లేయర్ అంటూ కొనియాడాడు. కెరీర్ ఆరంభంలోనే కోహ్లీ సూపర్ స్టార్ అవుతాడని భావించానని తెలిపాడు. 2008 అండర్ 19 ప్రపంచకప్‌తో భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ.. అదే ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టులోకి అడుగుపెట్టాడు. శ్రీలంకతో సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.
ఆ సమయంలో హర్భజన్ సింగ్ సీనియర్ స్పిన్నర్‌గా జట్టులో కొనసాగుతున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ.. హర్భజన్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు.

'విరాట్ కోహ్లీ ఓ దాదా ప్లేయర్. తొలిసారి అతను టీమిండియాలోకి రావడం నాకింకా గుర్తుంది. శ్రీలంకతో మ్యాచ్‌లో జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా స్పిన్నర్ అజంతా మెండీస్‌కు ఇబ్బంది పడ్డారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం స్వేచ్చగా అతన్ని ఎదుర్కొన్నాడు. ఆ క్షణమే విరాట్ కోహ్లీ సూపర్ స్టార్ అవుతాడని భావించాను.
టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పుడు ఆరంభంలో కోహ్లీ విఫలమయ్యాడు. ఆ సమయంలో నేను కోహ్లీకి ఒకటే చెప్పా. ఈ ఫార్మాట్‌లో నువ్వు కనీసం 10 వేలు పరుగులు చేయకుంటే నువ్వు ఆటగాడిగా ఓడినట్లేనని చెప్పాను. అతను తీవ్రంగా కష్టపడి ఈ స్థాయికి చేరాడు. ముఖ్యంగా అతని విల్ పవర్, ప్రవర్తన, కమిట్‌మెంట్ అసాధారణం.
రోహిత్ శర్మ ఆటగాళ్లతో చనువుగా ఉండే సారథి. జట్టులోని ప్రతీ ఒక్కరితో రోహిత్ భుజాలపై చేయి వేసి మాట్లాడంటే చనువుగా ఉంటాడు. ఆటగాళ్ల దగ్గరకు నవ్వుకుంటా వెళ్లి కెప్టెన్‌గా అతనికి కావాల్సింది అడుగుతాడు. ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా ఉంటాడు. ప్లేయర్లకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
తాము గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్ జట్టులో కంటే ఇటీవల టీ20 ప్రపంచకప్ 2024 సాధించిన రోహిత్ సేనలో మ్యాచ్ విన్నర్లు ఎక్కువగా ఉన్నారని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో పరిచయం లేని ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారని, పైగా టీ20 ఫార్మాట్ తమకు కొత్త అని గుర్తు చేశాడు.
అప్పుడు భారత జట్టులో చాలా మంది తొలిసారి ఆడిన ఆటగాళ్లే ఉన్నారని, టీ20లపై భారత్ పెద్దగా ఫోకస్ పెట్టలేదన్నాడు. టైటిల్ గెలవాలనే లక్ష్యంతోనే ఆ టోర్నీ ఆడామని చెప్పుకొచ్చాడు. ఆ జట్టులో నాతో పాటు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, అజిత్ అగార్కర్‌లు మాత్రమే అనుభవం కలిగిన ఆటగాళ్లని, ధోనీ కూడా ఆ టోర్నీతోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడని తెలిపాడు.